Telugu Gateway
Andhra Pradesh

ఎన్టీవీ చౌదరిపై ‘కొండంత’ ప్రేమ ఏంటి బాబూ!

ఎన్టీవీ చౌదరిపై ‘కొండంత’ ప్రేమ ఏంటి బాబూ!
X

నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో స్థలం కేటాయింపు!

తిరుమలను కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత, రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి అధికార వర్గాలు. తిరుమల కొండపై ఎన్టీవీ చౌదరికి ఏకంగా వెయ్యి గజాలకు పైనే స్థలాన్ని కేటాయించారు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాలు, సిఫారసుల మేరకే జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ స్థలంలో గెస్ట్ హౌస్ నిర్మించనున్నారు. తిరుమల కొండపై ఏకంగా వెయ్యి గజాలకు పైగా స్థలం కేటాయింపు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ స్థల కేటాయింపు చేయటం ద్వారా మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్నికల ముందు అనుకూల ప్రచారం చేయించుకునేందుకు ఈ ఎత్తుగడ వేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లేదంటే మహామహులకే సాధ్యం కాని భూ కేటాయింపులు ఓ ఛానల్ యాజమానికి అంత తేలిగ్గా ఎలా జరిగిపోతాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కొద్ది సంవత్సరాల క్రితం తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని ఏపీలో కొద్ది కాలం పాటు అసలు ఎన్టీవీనే రాకుండా చేసిన చంద్రబాబు..ఇప్పుడు ఛానల్ యాజమానిపై అంత ప్రేమ చూపించటానికి కారణం ఏంటి?.

అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని చెప్పకతప్పదు. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి స్థలాల కేటాయింపుపై నిషేధం ఉంది. గతంలో పలు బడా బడా కార్పొరేట్ సంస్థలకు భూములు ఇచ్చి అక్కడ గెస్ట్ హౌస్ లు కట్టడానికి అనుమతిచ్చేవారు. సంవత్సరంలో కొన్ని సార్లు ఈ భవన నిర్మాణ దాతలకు తప్పనిసరిగా కేటాయింపులు చేస్తారు. తర్వాత మాత్రం స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆ గదులు కేటాయిస్తారు. బడా బడా సంస్థలు/వ్యక్తులు తిరుమలలో గెస్ట్ హౌస్ లు ఉండటాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఎందుకు అంటే తిరుమలకు ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు వస్తారనే విషయం తెలిసిందే. కొండపై గెస్ట్ హౌస్ ఉండటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బెంగుళూరుకు చెందిన ఓ సంస్థకు ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుని మరీ ఎన్టీవీ చౌదరికి తిరుమల కొండపై ఈ భూకేటాయింపులు చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకు ప్రతిగా ఓ డీల్ కుదిరిందని చెబుతున్నారు.

Next Story
Share it