Telugu Gateway
Politics

వారణాసిలో మోడీ నామినేషన్

వారణాసిలో మోడీ నామినేషన్
X

ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు వారణాసిలో నామినేషన్ లో వేశారు. ప్రస్తుతం ఆయన ఇదే లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. గురువారం భారీ ర్యాలీ నిర్వహించిన మోడీ..శుక్రవారం ఉదయం పలు మిత్రపక్షాలకు చెందిన నేతలతో కలసి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్ అమిత్‌ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సహా ఎన్డీయే నేతలు, కేంద్రమంత్రులు వెంటరాగా... ప్రధాని మోదీ కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ సమర్పించారు. తన నామినేషన్‌కు ముందు వేలాదిగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘‘స్వాతంత్ర్యానంతరం తొలిసారి దేశంలో ప్రభుత్వం పట్ల సానుకూల పవనాలు వీస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా ప్రజలంతా మళ్లీ మోదీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు..’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘‘మళ్లీ ఒక్కసారి’’ అనగానే... ‘‘మోదీ సర్కార్’’ అంటూ కార్యకర్తలు నినదించారు. గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు కావడం మాత్రమే చూశామనీ.. కానీ గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వం పనిచేయడం చూస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ‘‘నేను ప్రధానమంత్రిని అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఒక్క కార్యకర్తను కూడా కలుసుకోకుండా ఉండలేదు. నాలోని కార్యకర్తను కూడా చావనివ్వలేదు. ప్రధానిగానూ, ఎంపీగానూ నా విధులు ఎలా నిర్వహించాలో నాకు తెలుసు...’’ అని మోదీ పేర్కొన్నారు.

Next Story
Share it