Telugu Gateway
Top Stories

‘జియో’ మరో సంచలనం

‘జియో’ మరో సంచలనం
X

రిలయన్స్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ‘జియో’తో దేశీయ టెలికం రంగంలో విప్లవం సృష్టించిన ఈ సంస్థ ఇప్పుడు మరో మెగా స్కీమ్ తో ముందుకు వస్తోంది. వాణిజ్యపరంగా ఇది అమలు అయితే దేశీయ మార్కెట్లో ఎన్ని ప్రకంపనలు వస్తాయో వేచిచూడాల్సిందే. రిలయన్స్ జియో రాకతో అప్పటివరకూ అగ్రశ్రేణి టెలికం కంపెనీలు కూడా హడలిపోవాల్సి వచ్చింది. అంతే కాదు.. ఆ కంపెనీల లాభదాయకతపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు రిలయన్స్ తలపెట్టిన కొత్త ప్లాన్ అమలు అయితే దేశీయ మార్కెట్లో పలు కంపెనీలు విలవిలలాడటం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే రిలయన్స్ అందించనున్న సేవలు అలా ఉండబోతున్నాయి. అంతే కాదు...ఓ సారి మార్కెట్ పై పట్టు సాధించిన తర్వాత రిలయన్స్ రేట్లు పెంచుకున్నా పెద్దగా ప్రభావం పడదు. ఈ మార్కెట్ టెక్నిక్ రిలయన్స్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియనే చెప్పొచ్చు. రిలయన్స్ ఇప్పుడు జియో గిగాఫైబర్‌తో మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. దీని ప్రకారం నెలకు కేవలం రూ.600 చెల్లిస్తే గిగాఫైబర్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌ లైన్‌ ఫోన్, టీవీ చానళ్ల ప్రసారాల సేవలను అందించ నుంది. ప్రస్తుతం జియో గిగాఫైబర్‌ సేవలను ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అందిస్తున్నారు.

వన్‌టైమ్‌ డిపాజిట్‌ కింద రూటర్‌ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్‌ డేటాను 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటోంది కంపెనీ. వచ్చే మూడు నెలల కాలంలో బ్రాండ్‌బ్యాండ్‌కు అనుసంధానంగా టెలిఫోన్, టెలివిజన్‌ సేవలను సైతం జోడించనుందని సమాచారం. జియో ఫోన్ తరహాలోనే ఈ స్కీమ్ కింద అన్ని సేవలు ఏడాది పాటు ఉచితంగా లభిస్తాయి. కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించేంత వరకు ఈ ఉచిత ఆఫర్‌ కొనసాగుతుంది. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయంతో ఉంటుందని, టెలివిజన్‌ చానళ్లను ఇంటర్నెట్‌ (ఐపీటీ) ద్వారా అందించనున్నట్టు తెలిపాయి. కంపెనీ అందించే రూటర్ తో మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు తదితర 45 పరికరాలను ఈ అనుసంధానించుకోవచ్చు.

Next Story
Share it