చంద్రబాబుపై జగన్ సెటైర్లు
‘సింధూకు షటిల్ నేనే నేర్పించా. ఆమె కప్ గెలిస్తే అది నా క్రెడిట్. ఓడిపోతే కోచ్ తప్పు. బిల్ గేట్స్ కు కంప్యూటర్ నేనే నేర్పించా. నేను కరెక్ట్ గా నే చెప్పా. కంప్యూటర్ నొక్కటంలో ఆయనే తప్పు చేశారు’.. ఇలా ఉంటుంది చంద్రబాబు వైఖరి అంటూ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. మంగళవారం నాడు గవర్నర్ ను కలసి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని..ప్రజల తన వైపు లేరనే విషయాన్ని గ్రహించే చంద్రబాబు ఈవీఎంల డ్రామాకు తెరతీశారని వ్యాఖ్యానించారు. టీడీపీతోపాటు అన్ని పార్టీ నేతలు ఓకే అన్న తర్వాత ఓటింగ్ ప్రారంభిస్తారని..నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లు ఓట్లు వేరే పార్టీలకు పడితే ఓటు వేసిన వారు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. 2014లో ఆయన ఇదే ఈవీఎంలతో గెలిచారని..అప్పుడు కనీసం వీవీ ప్యాట్లు కూడా లేవన్నారు. నంద్యాల ఎన్నికల్లోనూ చంద్రబాబు 30 వేల మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు. అప్పుడు లేని సమస్య..ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గ పాలన, అక్రమాలను ప్రజలు తిరస్కరిస్తున్నారనే విషయం గ్రహించి నెపాన్ని ఈవీఎంలపై నెట్టేందుకే ఈ దుర్మార్గమైన రాజకీయం అని ఆరోపించారు.
ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత నీచమైన రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు. జగన్ సారధ్యంలోని వైసీపీ బృందం రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసింది. పోలింగ్ ముగిశాక తమ పార్టీ వారిపై, తమకు ఓట్లేసిన సాధారణ ప్రజలపై టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు తనకు అస్మదీయులైన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంల భద్రపరిచిన చోట నిత్యం సీసీటీవీ నిఘా ఉంచటంతోపాటు..సీఈసీకి వీటిని అనుసంధానం చేయాలన్నారు. తాను నియమించుకున్న అధికారులతో అక్రమాలు చేసేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు.