Telugu Gateway
Politics

చంద్రబాబుకు ఈసీ షాక్

చంద్రబాబుకు ఈసీ షాక్
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఈసీ షాకిచ్చింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షలు చేయటం..ఆదేశాలు జారీ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. అధికారులు కూడా ఓ సారి ఎన్నికల నిబంధనలు చదువుకుని వ్యవహరించాలని పేర్కొంది. చంద్రబాబునాయుడు బుధవారం నాడు పోలవరం సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతే కాదు..తాను గతంలో ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8 వరకూ తానే ముఖ్యమంత్రిని అని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా..సీఎం సమీక్షలు నిర్వహించటం అనైతికం అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాంకేతికంగా చంద్రబాబు సీఎం అయినా...ఎలాంటి అధికారాలు ఉండవని..ఎన్నికలు అయిపోయాక ఇలా చేయకూడదని చంద్రబాబుకు తెలియదా? అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అందుకే ఈసీ రంగంలోకి దిగి మరోసారి ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఇక మంత్రులు, అధికారులతో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ నిబంధనలను సీఈవో గోపాలకృష్ణ ద్వివేది మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు సమీక్షలపై పలువురు మీడియా ప్రతినిధులు సీఈవోను సంప్రదించగా, ఎన్నికల కోడ్‌ చూస్తే మీకే తెలుస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు. చంద్రబాబు పోలవరం, సీఆర్‌డీఏపై సమీక్ష జరిపారు. అయితే సమీక్షలు చేయడం కూడా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అని ఈసీ వర్గాలు స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి హోంశాఖపై గురువారం నాడు జరగాల్సిన సమీక్షను రద్దు చేసుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఈసీ ఆదేశాలను పాటిస్తారా? లేక తానే సర్వం అని వ్యవహరిస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it