Telugu Gateway
Politics

బాబోయ్...అంత మంది చంద్రబాబులా!

బాబోయ్...అంత మంది చంద్రబాబులా!
X

ఒక్క చంద్రబాబుతోనే ప్రస్తుతం ఏపీ హోరెత్తిపోతోంది. అలాంటిది ఏకంగా 175 మంది చంద్రబాబులు అంటే ఏపీ భరించగలదా?. ఆ రాష్ట్ర ప్రజలు పారిపోవాల్సిందే. అసలు 175 మంది చంద్రబాబులు ఎలా వస్తారు అంటారా?. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి అభ్యర్ధిలో తననే అభ్యర్ధిగా చూడాలని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. అంతే కాదు..25 ఎంపీ అభ్యర్ధుల్లో కూడా తననే చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. ఏపీ ప్రజలు ఇప్పుడు నిత్యం మాటలు మార్చే ఒక్క చంద్రబాబుతోనే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఏకంగా 175 ప్లస్ 25 అంటే 200 మంది చంద్రబాబులను తట్టుకోగలరా?. చంద్రబాబును చూసి ఓటేయాలంటే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ కూడా మరి ‘చంద్రబాబు ఖాతా’లోనే వెయ్యాలన్న మాట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా సోలోగా చేసిన స్కామ్ లే భారీ ఎత్తున ఉంటే..మరీ ఎమ్మెల్యేల వాటా కూడా కలుపుకుంటే ఆ మొత్తం ఎంతకు చేరుకుంటుందో?. ఏపీలోని విపక్షాలు అన్నీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని రాష్ట్రం ఏర్పాటైన రెండళ్ల తర్వాత కోరితే ‘సఖ్యతతో ఉండి సాధిస్తా’. మేం బయటకు వస్తే మీరు లోపలికి దూరదామని చూస్తున్నారు.

మీ ఆటలు సాగనివ్వను అంటూ అసెంబ్లీ సాక్షిగా విపక్షాలపై విరుచుకుపడింది ఇదే చంద్రబాబు. రాజధాని అమరావతికి ఏపీలోని 13 జిల్లాలతో పాటు దేశంలోని ప్రముఖ పుణ్యస్థలాల నుంచి నీరు-మట్టి తెప్పించి చంద్రబాబు హంగామా చేశారు. అప్పట్లో ప్రధాని నరేంద్రమోడీ కూడా అచ్చం చంద్రబాబునే ఫాలో అయి ఏకంగా ఢిల్లీ నుంచి చెంబుడు నీళ్లు-మట్టి తెచ్చారు. ఈ తీరుపై అదే రోజు ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేయగా..ఇదే చంద్రబాబు ఆ చెంబుడు నీళ్లు-మట్టిని కళ్ళకు అద్దుకుని మరీ మందహాసంతో ఇవి స్వీకరించారు. తర్వాత అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కొత్త వ్యక్తిని ఎవరో మోసం చేసినట్లు మోడీ తనను మోసం చేశారని చంద్రబాబు ఏడాది నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. నాలుగు సంవత్సరాలు కలసి ఉండి ఏమీ సాధించలేని సీఎం..ఇప్పుడు తనను తాను ఓ పోరాటయోధుడిగా చెప్పుకుని మరోసారి ప్రజలను వంచించే పనిలో ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇప్పటివరకూ తాను మోడీ అంత అత్యుత్తమ ప్రధానిని చూడలేదని ప్రకటించి..ఇప్పుడు మోడీ అంత దుర్మార్గుడిని చూడలేదని ఎన్నికల సభల్లో ప్రసంగిస్తున్నారు. ఇందులో ఏది నిజం?. ఇలాంటి చంద్రబాబులు ఓ రెండు వందల మంది ఉంటారంటే ఆ ఊహే ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుందేమో!

Next Story
Share it