Telugu Gateway
Politics

కాంగ్రెస్..టీడీపీలో ఓడిన వారికి టీఆర్ఎస్ ఎంపీ టిక్కెట్లు

కాంగ్రెస్..టీడీపీలో ఓడిన వారికి టీఆర్ఎస్ ఎంపీ టిక్కెట్లు
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తారా? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఈ మధ్యే వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. నిజమే. కానీ ఎంతో బలంగా ఉందని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చేతిలో ఓడిపోయిన ఇతర పార్టీల ఎమ్మెల్యే అభ్యర్ధులకు టిక్కెట్లు ఇవ్వటం వెనక మతలబు ఏమిటి?. ఇది పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతం పంపుతుంది. ఖమ్మం అసెంబ్లీ బరి నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయనకే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఎంపీ టిక్కెట్ కేటాయించింది. అలాంటిదే మరో సంఘటన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి వెంకటేష్ నేతగానికి పెద్దపల్లి లోక్ సభ సీటు కేటాయించారు. ఈ సీటు ప్రభుత్వ సలహాదారు వివేక్ కు కేటాయిస్తారని ఆశించారు.

కానీ ఆయనకు పార్టీ అధిష్టానం షాకిచ్చి సొంత పార్టీ నేతలను కాదని..ఇతర పార్టీల్లో పరాజయం పాలైన వారిని తీసుకొచ్చి మరీ టిక్కెట్లు కేటాయించటం ఆసక్తికర పరిణామంగా మారింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఖమ్మం సీటు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలో ఉన్నప్పటి నుంచే నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య సఖ్యత లేదు. ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ ల కు కూడా నామాతో సఖ్యత అంతంత మాత్రమే. ఇన్ని వైరుధ్యాల మధ్య నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించగలరా?. దీనికి తోడు జిల్లాలో వరసగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ కు ఈ లోక్ సభ ఫలితాలు అత్యంత కీలకం కాబోతున్నాయి.

Next Story
Share it