నల్లగొండ బరిలో ఉత్తమ్

కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి మరీ టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నల్లగొండ ఎంపీ బరిలో నిలబెట్టింది. ఆయన పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపించకపోయినా..పీసీసీ అధ్యక్షుడే వెనకాడితే తప్పుడు సంకేతాలు వెళతాయని..పలితంతో సంబంధం లేకుండా బరిలో ఉండాల్సిందే అని అధిష్టానం తేల్చిచెప్పటంతో ఉత్తమ్ లోక్ సభ బరిలోకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం సోమవారం అర్ధరాత్రి తెలంగాణ లోక్ సభ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. తాజాగా ఖమ్మం మినహా మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్ స్థానానికి డీకే అరుణ, జి.మధుసూదన్‌రెడ్డి పేర్లపై చర్చ జరిగినప్పటికీ.. చివర్లో వంశీచంద్‌రెడ్డి పేరును ఖరారుచేసింది.
కొత్త జాబితా ప్రకారం హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్, సికింద్రాబాద్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య బరిలో దిగనున్నారు. అర్ధరాత్రి వరకు చర్చలు జరిపిన తర్వాత పాలమూరు నుంచి వంశీచంద్ రెడ్డి పేరు ఖరారుతో జాబితాను వెల్లడించింది. ఖమ్మం స్థానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.