వైసీపీకి 22 ఎంపీ సీట్లు..టీడీపీకి మూడే
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెల్లడైన జాతీయ ఛానల్ సర్వేలోనూ ఏపీలో ప్రతిపక్ష వైసీపీ అప్రతిహత విజయాన్ని దక్కించుకోనున్నట్లు వెల్లడైంది. వైసీపీ ఏకంగా ఏపీలో 22 ఎంపీ సీట్లను దక్కించుకోనుండగా...అధికార టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితం కాబోతోంది. ఈ వివరాలను ప్రముఖ జాతీయ ఛానల్ ‘టైమ్స్ నౌ’ వెల్లడించింది. ఇది ఖచ్చితంగా అధికార టీడీపీకి చేదు వార్తే. అదే సమయంలో ప్రస్తుతం ఒకేసారి 175 సీట్లలో అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో హోరెత్తిస్తున్న వైసీపీకి అనుకూల పరిణామం.
గతంలోనూ పలు జాతీయ ఛానళ్లు ట్రెండ్ అంతా వైసీపీకే అనుకూలంగా ఉన్నట్లు చూపించాయి. తాజాగా రిపబ్లిక్ టీవీ మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను చూపించింది. అంతకు ముందు ఇదే ఛానల్ వైసీపీకి ఫేవర్ గా ఫలితాలను ప్రకటించింది. అదే సమయంలో తెలంగాణలో ఫలితాలను కూడా టైమ్స్ టౌ సర్వే వెల్లడించింది. టీఆర్ఎస్ 13 సీట్లకు పైగా దక్కించుకోనున్నట్లు పేర్కొంది. మిగిలిన సీట్లను యూపీఏ, ఎన్డీయే పక్షాలు దక్కించుకోవచ్చని పేర్కొంది.