Telugu Gateway
Politics

కారెక్కనున్న సబితా..కార్తీక్ రెడ్డి!?

కారెక్కనున్న సబితా..కార్తీక్ రెడ్డి!?
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నఆ పార్టీకి తాజా అసెంబ్లీ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఇంకా ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ‘జంపింగ్’లు స్టార్ట్ చేయటంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కటానికి రెడీ అయిపోయారు. కొత్తగా ఇప్పుడు మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా కారెక్కటానికి రెడీ అయిపోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. సబితతో పాటు ఆమె తనయుడు, కార్తీక్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో పరిణామాలపై సబితా ఇంద్రారెడ్డి గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు.

వాస్తవానికి ఆమె తన కొడుకు కార్తీక్ రెడ్డికి చేవేళ్ళ ఎంపీ సీటు ఇస్తారని ఆశించారు. కానీ టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో చేరటంతో కార్తీక్ కు అవకాశం లేకుండా పోయింది. సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్ లో చేర్పించే అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ప్రచారం. అదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తో మాజీ మంత్రి సబితా రెడ్డి భేటీ అయ్యారని చెబుతున్నారు. అయితే ఈ వార్తలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే టీఆర్ఎస్ ఇప్పటికే చేవేళ్ళ ఎంపీగా ఓ పారిశ్రామికవేత్తను రంగంలోకి దింపింది. మరి కార్తీక్ రెడ్డికి ఎంపీ సీటు హామీ లభిస్తుందా? లేక సబితకు మంత్రి పదవి హామీతో చేర్చుకుంటారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it