Telugu Gateway
Cinema

కొమరం భీంగా ఎన్టీఆర్..అల్లూరిగా రామ్ చరణ్

కొమరం భీంగా ఎన్టీఆర్..అల్లూరిగా రామ్ చరణ్
X

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాకు సంబంధించి పలు కీలక విషయాలు బహిర్గతం అయ్యాయి. చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం పెట్టి మరీ ఈ విషయాలను వెల్లడించాయి. ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించనున్నారు. అయితే ఇప్పటి వరకూ చరిత్రలో చూసిన క్యారెక్టర్లు కాకుండా...ఎవరికీ తెలియని కొమరం భీం, ఎవరికీ తెలియని అల్లూరి సీతారామరాజును తాను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు రాజమౌళి వెల్లడించారు. 1920కి ముందు వీళ్ళు ఎలా ఉండేవారు..ఏమి చేశారు అనే విషయాలు ఇందులో ఉంటాయన్నారు. రామ్ చరణ్ కు జోడీగా ఈ సినిమాలో భాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటించనున్నారు. మరో కీలక పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ నటించనున్నారు. ఈ సినిమా అంచనా వ్యయం 350 నుంచి 400 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని నిర్మాత దానయ్య వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీని కూడా రాజమౌళి వెల్లడించారు.

2020 జూలై 30న సినిమా విడుదల అవుతుందని..ఇది కేవలం ఒక్క పార్ట్ లోనే ఉంటుందని తెలిపారు. ఆర్‌ఆర్ఆర్‌ 1920లో ఉత్తర భారతదేశంలో జరిగే కథగా తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజమౌళి. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజమౌళి. మరో కీలక పాత్రలో తమిళ నటుడు సముద్రఖని నటిస్తున్నారు. 2020 జూలై 30న తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషలతో పాటు దాదాపు 10 భారతీయ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టుగా నిర్మాత దానయ్య తెలిపారు. సినిమా టైటిల్ కామన్ అన్ని భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ ఉంటుందని..అయితే ఏ భాషకు ఆ భాషకు విడిగా కొత్త టైటిల్ మాత్రం ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రేక్షకుల నుంచి సూచనలు..సలహాలు కోరుతున్నట్లు తెలిపారు.

Next Story
Share it