ఏపీలో మంత్రులకే ‘టిక్కెట్ల టెన్షన్’
ఏపీలోని అధికార టీడీపీలో పరిణామాలు సీనియర్ నేతల్లో సెగలు పుట్టిస్తున్నాయి. సాక్ష్యాత్తూ కొంత మంది మంత్రుల సీట్లకే ఎసరు వస్తుండటంతో వారు తమ సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సిద్ధా రాఘవరావు గెలుపు అనుమానం అనే నివేదికలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. దీంతో ఆయన్ను ఒంగోలు ఎంపీగా పంపించేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అందుకు ఆయన ససేమిరా అంటున్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఆయనకు ఎమ్మెల్యే సీటు వస్తుందా? లేక విశాఖ ఎంపీగా పంపిస్తారా? అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గంటా మాత్రం ఎమ్మెల్యేగా పోటీచేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. వీళ్ళిద్దరితోపాటు మరో ఇద్దరు మంత్రులు కాలువ శ్రీనివాసులు, జవహర్ లు వారి వారి నియోజకవర్గాల నేతల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు ఎటుదారితీస్తాయో అన్న టెన్షన్ టీడీపీ వర్గాల్లో నెలకొంది. స్పీకర్ కోడెల శివప్రసాద్ సీటు పంచాయతీ కూడా ఇంకా తేలటం లేదు. ఆయన్ను నరసరావుపేట ఎంపీగా పంపించాలని అధిష్టానం యోచిస్తుంటే..ఆయన మాత్రం ఏదో ఒక అసెంబ్లీ సీటే తనకు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో మంత్రి నారా లోకేష్ పోటీచేసే అసెంబ్లీ సీటు విషయంలో కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తొలుత లోకేష్ పోటీ భీమిలి నుంచి అన్నారు. ఇప్పుడు విశాఖ నార్త్ అని ప్రచారం మొదలైంది. ఇప్పటికే మంత్రి ఆది నారాయణరెడ్డి ని కడప ఎంపీగా పంపారు చంద్రబాబు. కాల్వ శ్రీనివాస్ కు సీటు ఇవ్వొద్దంటూ ఎమ్యెల్సీ దీపక్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తమను కాదని సీటు ఇస్తే ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతానని మెట్టు గోవింద్ రెడ్డి చెబుతున్నారు. ఈ వ్యవహారం అంతా అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ ను పెడన ఎమ్మెల్యే గా పంపి..అక్కడ నుంచ వంగవీటి రాధ ను ఎంపీ గా పోటీ చేయించాలన్నది చంద్రబాబు ప్లాన్ గా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.