Telugu Gateway
Politics

ఎంపీ కవితకు ‘రైతుల నామినేషన్ చిక్కులు’!

ఎంపీ కవితకు ‘రైతుల నామినేషన్ చిక్కులు’!
X

లోక్ సభ ఎన్నికల్లోనూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అత్యధిక స్థానాలు గెలుచుకోనే ఛాన్స్ ఉందనే అంచనాల నడుమ నిజామాబాద్ రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ లోక్ సభ పరిధిలో వేల సంఖ్యలో రైతులు లోక్ సభకు నామినేషన్ వేసేందుకు సిద్ధపడుతుండంతో ఇక్కడి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అయితే ఇది సీఎం కెసీఆర్ తనయ, సిట్టింగ్ ఎంపీ కవిత గెలుపు అవకాశాలపై ప్రభావం చూపిస్తుందా? లేదా అన్న అంశం చెప్పటం కష్టం కాని..రైతుల నామినేషన్ల వ్యవహారంతో ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలోని రైతులు గత కొంత కాలంగా తాము ఆరుగాలం కష్టపడి పండించిన ఎర్రజొన్నలు..పసుపులకు సరైన గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను అసలు పట్టించుకోవటంలేదని..రాష్ట్ర ప్రభుత్వం సైతం తమ నిరసనలను కూడా నిరంకుశంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని రైతులు విమర్శిస్తున్నారు.

తమ డిమాండ్ల విషయంలో రాష్ట్ర సర్కారు స్పందన కూడా సరిగాలేదని అందుకే తాము పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక్కో గ్రామం నుంచి ఐదుగురు లెక్కన నామినేషన్ వేయటానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు పలు గ్రామాలకు చెందిన రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ కు వచ్చి నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. గతంలో తమకు అందిన మద్దతు ధరతో చాలా నష్టపోయాం అని..ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రైతుల నామినేషన్ల సంఖ్య వేలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు మళ్ళుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it