Telugu Gateway
Politics

చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్

చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రముఖ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ లెటర్ పోస్టు చేశారు. తనను రెచ్చగొడితే అన్నయ్య.. దివంగత ఎన్టీఆర్‌కు చేసిన మోసాలు, జరిగిన ఘోరాలను బయటపెడ్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నటుడు మోహన్‌బాబు హెచ్చరించారు. తన కుటుంబంపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ గురించి అడిగితే చెప్పే ధైర్యం లేక జోకర్ల చేత మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా జీవితం తెరచిన పుస్తకం. నీది అవినీతి చరిత్ర. ఎనీటైం.. ఎనీ ప్లేస్‌.. నువ్వే నేరుగా నాతో చర్చకు రా.. నిజానికి నా స్థాయికి నువ్వు తగవు. మాకు వచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయి. నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలు చెప్పగలవా? ట్విటర్‌, యూట్యూబుల్లో అవి వసూలు చేశావ్‌.. ఇవి వసూల్‌ చేశావ్‌ అంటూ నీ తరఫున కొంతమంది వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన వసూళ్ల గురించి కూడా వాళ్లను చెప్పమను. మాకు ఇచ్చిన విరాళాలకు లెక్కలున్నాయి. మరి నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలున్నాయా? నీ అడుగులకు మడుగులొత్తితే సైలెంట్‌గా ఉంటావ్‌. లేకపోతే లేనిదానిని ఉన్నట్టుగా అపనిందలు వేయిస్తావా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

పదవులు ఉంటాయి పోతాయి. డబ్బు సంపాదన ఎంతవరకు జాగ్రత్త.. అన్న ఎన్టీఆర్‌కు ఏమీ చేశావో అవన్నీ చెబితే బాగుండదు. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చెయ్యగలవు. అది నన్ను చంపించడం అంతే. అంతకంటే ఏమీ చెయ్యలేవు. జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు. నా జీవితం తెరచి ఉన్న పుస్తకం. అందులోని ప్రతి పేజీ, ప్రతి పేరా,ప్రతి వాక్యం, ప్రతి అక్షరమూ ఎవ్వరైనా చదువుకోవచ్చు. కానీ నీ జీవితం మూసి ఉన్న పస్తకం. అది తెరిస్తే ఏ అవినీతి బయటపడుతుందో అని నువ్వు వణికిపోతున్నావ్‌. నీ మోచీతి నీళ్లు తాగేవాళ్లు కాదు.. నువ్వు నేనే. ఎనీటైమ్‌, ఎనీ ప్లేస్‌, ఎనీ వేర్‌ చర్చకు సిద్ధం. తెలగుదేశం తమ్ముళ్లూ.. మీలో కూడా నన్ను అభిమానించే వాళ్లు చాలా మంది ఉన్నారు. మీరు కూడా పార్టీలో ఎందుకున్నారంటే అన్నయ్య మీద ఉన్న ప్రేమతో. అది మీ అభిమానం. నేను కాదనను. ఇక వద్దు మొదలుపెడితే చాలా దూరం పోతుంది. నాకు, నా కుటుంబానికి, నా విద్యాసంస్థలకు ఏమి జరిగినా దానికి అతడే (చంద్రబాబు) కారణం’ అని పేర్కొన్నారు.

Next Story
Share it