Telugu Gateway
Cinema

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ
X

ఈ మధ్య కాలంలో విడుదలకు ముందే ఇంతగా ప్రచారం పొందిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఒక్కటే. ఓ వైపు ఈ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు..విమర్శలు..ప్రతి విమర్శలు. ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి ఈ సినిమా శుక్రవారం నాడు తెలంగాణలో..ఓవర్సీస్ లో విడుదలైంది. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ల పేరుతో కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తీస్తే...‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ద్వారా ఆయన జీవిత చరిత్రలోని అసలు నిజాలను రామ్ గోపాల్ వర్మ విజయవంతంగా ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేశారు. లక్ష్మీస్ సినిమాకు అవసరమైన కీలక పాత్రల ఎంపిక ద్వారానే వర్మ సగం విజయం సాధించారు. మిగిలిన సగం సినిమాను ట్రాక్ తప్పకుండా నడిపించటంలోనూ సక్సెస్ అయ్యారు. లక్ష్మీపార్వతి తన జీవితంలోకి ప్రవేశించటాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులనే దూరం పెడతారు ఎన్టీఆర్. చివరకు అల్లుడు బాబును కూడా దూరం పెడతారు. దూరమైన ఎన్టీఆర్ కు దగ్గయ్యేందుకు బాబు ఓ న్యాయవాది ద్వారా రాయభారం నడుపుతారు. ఇందుకు ఆయన లక్ష్మీపార్వతి సాయమే తీసుకుంటారు. అప్పటి నుంచి మరింత లోతైన కుట్రలకు రంగం సిద్ధం అవుతుంది. ఆవేశపరుడైన ఎన్టీఆర్ ఎలా చేస్తే రియాక్ట్ అవుతారో తెలిసిన బాబు అందుకు అనుగుణంగా స్కెచ్ లు రెడీ చేసి అమలు చేస్తారు.

ఓ సారి లక్ష్మీపార్వతి కంటి చికిత్స కోసం ఆస్పత్రికి వెళితే..ఆమె గర్భం దాల్చుతోందని కుటుంబ సభ్యులకు చెప్పి..వారసుడు పుడితే మీ జీవితాలు కష్టాల్లో పడతాయని..ఆస్తి కూడా ఆమె పేర రాస్తేస్తాడనని..దీన్ని అడ్డుకోవాలని కోరతాడు. దీంతో కుటుంబ సభ్యులందరూ బాబుకు మద్దతు పలుకుతారు. లక్ష్మీపార్వతిపై వ్యతిరేక ప్రచారానికి..ఆమె పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తోందని..అభ్యర్ధుల ఎంపికలోనూ ఆమె జోక్యం ఎక్కువైందని ఆరోపిస్తూ బాబు అస్మదీయ పత్రికాధిపతితో మాట్లాడి కథనాలు రాయించుతాడు. చివరకు ఎన్టీఆర్ ను పదవీచ్యుడితిని చేయటానికి రెడీ అయిపోయి వైస్రాయ్ లో క్యాంప్ పెట్టడం, ఎన్టీఆర్ కు నమ్మకస్తుడైన లాయర్ ద్వారా అసెంబ్లీ రద్దుకు లేఖ రాయించి మిగిలిన ఎమ్మెల్యేలను కూడా తన వైపు తిప్పుకున్న సంఘటనలను వర్మ పర్పెక్ట్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో హైలెట్ గా చెప్పుకోవాలంటే వైస్రాయ్ ఘటన కంటే ముందు ఎన్టీఆర్ చనిపోయే సమయంలో తమ మధ్య ప్రేమానుబంధాలు తప్ప..వేరే ఏమీ లేదని చెప్పేందుకు అమ్మా...అమ్మా అంటూ గుండె మీద పడుకోమని లక్ష్మీ పార్వతికి చెప్పే సంఘటన ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి అసలు ఏమి చేశారు.

బాబు ఏమి చేసినట్లు చూపించాడు అన్నదే అసలు సినిమా. వర్మ చెప్పినట్లు ఇది ఖచ్చితంగా ‘లక్ష్మీ పార్వతి’ కోణంలో తీసిన సినిమానే. ఎంత వరకు నమ్ముతారు..నమ్మరనే విషయాన్ని పక్కన పెడితే లక్ష్మీ పార్వతిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఎంతో కొంత మార్చటానికి ఈ సినిమా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సినిమా ఇద్దరి అసలు విషయాలను బహిర్గతం చేసింది. ఒకటి బాబును. రెండవది ఓ పత్రికాధిపతిని. ఎన్టీఆర్ పాత్ర పోషించిన విజయ్ కుమార్, లక్ష్మీ పాత్ర పోషించి యజ్ఞ శెట్టి నటన సినిమాకు హైలైట్. బాబు పాత్ర వచ్చిన సమయంలో వర్మ పెట్టిన మ్యూజిక్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. కాకపోతే ఈ సినిమాలో ఉన్న లోపం ఒక్కటే. అత్యంత నిజాయతీపరుడైన టీడీపీ సీనియర్ నేతను ఓ అవినీతిపరుడిగా చూపించటం. ఇది తప్ప..సినిమా అంతా ఓకే. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ గ్రిప్పింగ్ గా ఉంది.

రేటింగ్. 3.25/5

Next Story
Share it