Telugu Gateway
Politics

లోకేష్ కృష్ణా జిల్లాను నమ్మటం లేదా..!?

లోకేష్ కృష్ణా జిల్లాను నమ్మటం లేదా..!?
X

కృష్ణా జిల్లా లోకేష్ ను నమ్మటం లేదా?. లోకేషే కృష్ణా జిల్లాను నమ్మటం లేదా?. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తారని బలంగా ప్రచారం జరిగింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తమ సీట్లను కూడా ఆఫర్ చేశారు. అదీ కాక తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన వారనే విషయం తెలిసిందే. తాత జిల్లా నుంచే లోకేష్ పోటీ చేస్తారని పార్టీ నేతలు భావించారు. దీనికి తోడు సామాజిక సమీకరణల పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని లెక్కలేసుకున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగూ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున లోకేష్ ను ఆంధ్రా ప్రాంతం నుంచి బరిలో దింపుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా లోకేష్ ఉత్తరాంధ్ర వైపు చూడటం వెనక రకరకాల కారణాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రాజకీయంగా కృష్ణా జిల్లా చాలా డైనమిక్. ఇక్కడ నేతలను మేనేజ్ చేయటం అంత సులభం కాదని..అదే ఉత్తరాంధ్ర నేతలు అయితే కృష్ణా జిల్లాతో పోలిస్తే సౌలభ్యంగా ఉంటుందనే కారణంతోనే అటువైపు చూస్తున్నారని చెబుతున్నారు. నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నుంచి బరిలో దిగుతారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఓ వైపు రాజధాని ప్రాంతం అయిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే టీడీపీ..ఇదే ప్రాంతం నుంచి సాక్ష్యాత్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను ఇక్కడ నుంచి పోటీ చేయించటానికి భయపడుతుంది అంటే కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అంతిమంగా లోకేష్ సీటు ఎక్కడ ఖరారు అవుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it