మార్పు తెచ్చే ఎన్నికలు ఇవి..పవన్

ఓట్ల కోసం రాజకీయాలు చేయటం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలు వెయ్యి, రెండు వేలు ఇస్తే వాళ్ళే ఓట్లు వేస్తారులే అని అనుకుంటున్నాయని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమని, ఇవి మార్పుకు నాంది పలికే ఎన్నికలన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ మా బాబే రావాలి అంటుంది... చంద్రబాబు మాత్రం తన కొడుకు రావాలని కోరుకుంటున్నారని అన్నారు.. ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్లు తానే పాలించాలి.. ప్రతి ఇంట్లో తన ఫోటో పెట్టుకోవాలని కోరుకుంటున్నారు... ఒక్క జనసేన పార్టీ మాత్రమే మీ ఇంట్లో మీ ఫోటో, మీ బిడ్డల ఫోటో పెట్టుకునేలా వారికి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటుందని తెలిపారు. మనతో ఓట్లు వేయించుకుని మనల్నే పరిహాసం చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. నోట్లకోసం ఓట్లు అమ్ముకోకుండా మార్పు కోసం నిలబడే నవతరానికి అండగా నిలబడాలని కోరారు.
సోమవారం రాత్రి ఒంగోలు చర్చి సెంటర్ లో జరిగిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో సమస్యలు చూస్తే మాత్రం బాధ కలుగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది. కనిగిరిలో ఫ్లోరోసిస్ వల్ల ఎముకలు వంకరపోయి, కిడ్నీలు పాడై జనం మంచానపడుతున్నారు. నిరుద్యోగం పెరిగి యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వలసలు పోతున్నారు. ఇక్కడ పెరిగినవాడిగా ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నిలబడిన వాడిగా మాటిస్తున్నా.. దొనకొండ పారిశ్రామిక కారిడార్ లో పరిశ్రమలు నెలకొల్పి ప్రకాశం జిల్లా నుంచి వలసలు ఆగిపోయేలా చేస్తాం. యువత ఆశయాలు అర్ధం చేసుకున్న పార్టీ జనసేన పార్టీ. వారి ఆకాంక్షల కోసమే జనసేన పార్టీ పెట్టాను అని తెలిపారు.