హైదరాబాద్ ఇప్పుడు కళావిహీనంగా మారింది
శ్రీకాకుళం జిల్లా ఎన్నికల ప్రచారంలో శనివారం నాడు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. ‘మనం రాగానే హైదరాబాద్ కళావిహీనంగా తయారైంది’ అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. అమరావతి అభివృద్ధి అయితే ఎక్కడ హైదరాబాద్ లో ప్రగతి ఆగిపోతుందనే భయంతోనే కెసీఆర్ జగన్ తో కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి కెసీఆర్ కు జగన్ కు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఇంత కాలంగా తానే హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని చెప్పుకున్న చంద్రబాబు ఈ సారి ఏకంగా తెలంగాణాను తానే అభివృద్ధి చేశానని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. కెసీఆర్ కు అభివృద్ధి చేతకాక అమరావతి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
జగన్ అధికారంలోకి వస్తే అమరావతి ఎక్కడిది అక్కడే ఆగిపోతుందని ఆరోపించారు. తనను మళ్ళీ అధికారంలోకి తెస్తే అమరావతిని బంగారు బాతుగా తయారు చేస్తానని తెలిపారు. తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ అనే బంగారు బాతును ఉపయోగించుకుంటూ కెసీఆర్ తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ, కెసీఆర్, జగన్ లు కలసి కుట్రలు చేస్తున్నారని..వీరి కుట్రలను ప్రజలందరూ కలసి తిప్పికొట్టాలని కోరారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో తాను తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో హైదరాబాద్ లాంటి నగరాలను నిర్మిస్తున్నారని చెబుతున్నారు.