Telugu Gateway
Politics

ఏపీలో తొలిసారి ‘పంచతంత్రం’...ఒంటరైన చంద్రబాబు

ఏపీలో తొలిసారి ‘పంచతంత్రం’...ఒంటరైన చంద్రబాబు
X

ఐదు పార్టీల పోరు మధ్యలో అంతిమ విజేత ఎవరో?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఓ కొత్త ట్రెండ్. తొలిసారి అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ‘ఒంటరి’ అయింది. ఆ పార్టీతో బహిరంగంగా కలసి రావటానికి ఎవరూ సాహసించని పరిస్థితి. కానీ ‘రహస్య ఒప్పందాలు’ మాత్రం చాలానే ఉన్నాయి. అయితే ఏపీలో తొలిసారి ‘రాజకీయ పంచతంత్రం’ సాగుతోంది. ఈ పంచతంత్రంలో అంతిమ విజేతగా ఎవరు నిలుస్తారో తేలాలంటే మే 23 వరకూ వేచిచూడాల్సిందే. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలకు..ప్రస్తుత ఎన్నికలకు స్పష్టమైన తేడా ఉంది. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బిజెపిలు ఒంటరిగా పోటీచేస్తుంటే...జనసేన, సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో జట్టుకట్టి బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో ఇదే జనసేన, బిజెపి, టీడీపీల కలసి పోటీచేసిన సంగతి తెలిసిందే. కానీ అందుకు భిన్నంగా ఈ సారి ఎవరికి వారే అన్నట్లు తలపడుతున్నారు. జనసేన, బిజెపిలు దూరమవటం టీడీపీకి పెద్ద మైనస్ గా మారనుంది. పలు అంశాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది.

కాంగ్రెస్ సొంతంగా బరిలో నిలిచినా గత ఎన్నికలకూ..ఇప్పటికి పెద్ద తేడా లేదు. తొలి రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై దూకుడుతో వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ తర్వాత రాహుల్, చంద్రబాబుల మధ్య కుదిరిన దోస్తానాతో అది కాస్తా కూడా తుడిచిపెట్టుకుపోయింది. అయితే కాంగ్రెస్ పోటీ ఓట్లు చీల్చటానికి పనికొస్తుంది. కానీ ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకునే పరిస్థితి మాత్రం లేదని చెప్పొచ్చు. బిజెపిదీ ఇంచుమించు ఇదే పరిస్థితి. ఏపీ ప్రజల్లో బిజెపిపై కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండటంతో ఆ పార్టీ పోటీ కూడా నామమాత్రమే. మరో పార్టీ జనసేన పొత్తులతో కలసి బరిలో దిగినా ఆ పార్టీ నిర్ణయాలు ప్రజల్లో అనుమానాలను మరింత పెంచేవిగా ఉన్నాయే తప్ప..ఏ మాత్రం తగ్గించేవిగా లేవు. పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి కారణంగానే సీరియస్ రాజకీయవేత్తలు ఎవరూ అటువైపు చూసిన దాఖలాలు లేవు. దీంతో జనసేన ప్రభావం ఏపీలో ఎంత ఉంటుంది అన్నది వేచిచూడాల్సిందే. బరిలో ఎన్ని పార్టీలు ఉన్న ప్రధాన పోరు మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే అన్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు దూరమవటం, ప్రభుత్వంపై పలు అంశాల్లో వ్యతిరేకత టీడీపీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. వైసీపీ మాత్రం గతానికి భిన్నంగా ఈ సారి ఒకే దఫా 175 అసెంబ్లీ సీట్లను ప్రకటించటంతోపాటు..అందులో బలహీనవర్గాలకు పెద్ద పీట వేయటం ద్వారా సానుకూల వాతావరణం కల్పించుకోగలిగింది. టీడీపీ ఓటు పలు మార్గాల్లో చీలిపోతున్నందున గత ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకు యధాతథంగా ఉన్నా తమ గెలుపు గ్యారంటీ అనే ధీమాతో ఉంది వైసీపీ. దీనికి తోడు రాజధాని వైఫల్యాలు..రైతు రుణమాఫీ సంపూర్ణయంగా చేయకపోవటం..కేవలం ఎన్నికల ముందు చంద్రబాబు జిమ్మిక్కులు చేయటం వల్ల ప్రజలు వాటిని నమ్మరని ప్రతిపక్షం నమ్మకంతో ఉంది. మరి ఏపీ రాజకీయాల్లో తొలిసారి జరుగుతున్న ఈ ‘పంచతంత్రం’లో అంతిమ విజేతగా ఎవరు నిలుస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it