Telugu Gateway
Politics

కెసీఆర్ పై వివేక్ ఫైర్

కెసీఆర్ పై వివేక్ ఫైర్
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ పై తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, మాజీ ఎంపీ వివేక్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దపల్లి ప్రజలకు తనను దూరం చేసేందుకు చేసిన ద్రోహం ద్రిగ్భాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయనివాళ్లకు టికెట్లిచ్చారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కనబెట్టారు. తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినవాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండడం బాధిస్తోంది. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వపోకడలను ప్రజల మీద రుద్ధుతున్నారు. ఈ విషయాన్ని జనం త్వరలోనే గుర్తిస్తారు. ఒక ప్లాన్ ప్రకారమే తాను పోటీచేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరిక్షణంలో టికెట్ నిరాకరించారు.

ఇప్పుడు ఆయన ఆటబొమ్మలు కొందరు నామీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయింది. నా తండ్రి కాకా, నేను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశాం. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చాను. తెలంగాణ కోసం పనిచేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమా? పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్ఠం చేయడానికి పనిచేయడమే నేను చేసిన ద్రోహమా? 2014లో టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలే ఉంటే నేను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే నేను చేసిన ద్రోహమా? తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే నేను చేసిన ద్రోహం కావచ్చు అని తన లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it