Top
Telugu Gateway

చంద్రబాబు హామీలు...షరతులు వర్తిస్తాయి

చంద్రబాబు హామీలు...షరతులు వర్తిస్తాయి
X

వాణిజ్య ప్రకటనలు. చంద్రబాబు హామీలు. రెండూ ఒకటే. పెద్ద పెద్ద వాణిజ్య ప్రకటనల్లో పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తూ వాటి కిందే కన్పించి..కన్పించనట్లు ‘షరతులు వర్తిస్తాయి’ అని రాస్తారు. ఇది అందరూ చూసిందే. ఈ ప్రకటనలు చూసి వినియోగదారులు హడావుడిగా కొనుగోళ్ళకు ఎగబడతారు. చివరకు బిల్లు చేసే సమయంలో అసలు విషయం బయటపడుతుంది. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఎన్నికల హామీలు కూడా’ అలాంటివే. ఎన్నికలకు ముందు ఎడాపెడా హామీలు ఇచ్చేస్తారు. వాటికి సంబంధించిన వీడియోలు ఉన్నా. ఎవరైనా మీరు ఆ హామీ ఇచ్చారు కదా? అని ప్రశ్నిస్తే ‘నేనెక్కడ అన్నా. ఎవరు చెప్పారు. నీకు కల ఏమైనా వచ్చిందా? ’ అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తారు. గత అనుభవాలను చూస్తే ఈ విషయాలు ఎంతో స్పష్టంగా తెలుస్తాయి. 2014 ఎన్నికలకు ముందు తన అనుభవ నైపుణ్యంతో ఏపీలో రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. తీరా అమల్లోకి వచ్చేసరికి కోతలు పెట్టి పెట్టీ..తగ్గించారు. పోనీ తగ్గించిన మొత్తం అయినా అమలు పూర్తి చేశారా? అంటే అదీ లేదు.

మరో వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా..ఈ రుణమాఫీకి సంబంధించిన ఇప్పుడు రెండు విడతలు ఇప్పుడు బ్యాంకులో వేస్తామని చెబుతున్నారు. అది కూడా అమలు అవుతుందా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. నిరుద్యోగ భృతి. ఎన్నికల హామీ. కానీ అమలు ప్రారంభించింది ఎప్పుడు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు. అందులోనూ రకరకాల కారణాలు చెప్పి ‘అర్హుల ఏరివేత’. ముందు రెండు వేలు చెప్పి..ఏడాది చివరిలో వెయ్యితో పథకం ప్రారంభించి..ఎన్నికల ముందు దాన్ని మళ్ళీ రెండు వేలకు పెంచారు. అన్న క్యాంటీన్ కూడా ఎన్నికల హామీనే. దీన్ని కూడా ఎన్నికలకు ఏడాది ముందే ప్రారంభించారు. డ్వాక్రా రుణాల మాఫీ, ఉద్యోగ కల్పన ఇలా అన్నింటినిలోనూ ఘోరంగా విఫలమయ్యారు. తన అనుభవంతో అద్భుతాలు సృష్టించిన చంద్రబాబునాయుడు ప్రజలకు ఎలాంటి హామీ లేకుండానే లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన మాత్రం భారీ ఎత్తున ‘భారం’ పెట్టారు.

మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ముందు ఇదే తరహాలో అడ్డూఅదుపు లేని హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. చంద్రన్న భీమా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంపు, డ్వాక్రా మహిళలకు మూడు సార్లు పసుపు-కుంకుమ, పట్టణ పేదలకు ఉచితంగా ఇళ్ళ నిర్మాణం. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు హామీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రం దివాళా తీసినా పర్లేదు..నేను ఈ ఎన్నికల్లో గెలిస్తే చాలు అన్న చందంగా ఉంది చంద్రబాబు తీరు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా హామీలు పెద్ద ఎత్తునే ఇస్తున్నా అతని హామీల అమలు తీరును మదింపు చేయటానికి ఆయన ఎప్పుడూ అధికారంలో లేరన్న విషయం తెలిసిందే.

Next Story
Share it