Telugu Gateway
Politics

చంద్రబాబు..జగన్.. రన్ రాజా రన్

చంద్రబాబు..జగన్.. రన్ రాజా రన్
X

ఇంకా నడిస్తే నడవదు. పరుగులు పెట్టాల్సిందే. ఢీ అంటే ఢీ అంటున్న సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తాడోపేడో తేల్చుకోవటానికి సరిగ్గా నెల అంటే నెల రోజులే సమయం ఉంది. అధికార టీడీపీని ఈ షెడ్యూల్ ఒకింత ఇరకాటంలోకి నెట్టిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరీ ఇంత తక్కువ సమయం ఉంటుందని టీడీపీ ఊహించలేదు. ఎంతలేదన్నా టీడీపీలో టిక్కెట్ల వ్యవహారం కొలిక్కి రావటానికి కనీసం ఇంకా వారం రోజులు పట్టే అవకాశం ఉంది. టిక్కెట్ల ఖరారు..అసంతృప్తి నేతల బుజ్జగింపులు..ప్రచారం ఇవి అన్నీ పూర్తి చేయటానికి నెల రోజులు ఏ మాత్రం సరిపోవు. ఇది అధికార టీడీపీకి ఇరకాట పరిస్థితే. సాక్ష్యాత్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటి, పంచాయతీరాజ్ ల శాఖ మంత్రి నారా లోకేష్ టిక్కెట్ పైనే ఇఫ్పటివరకూ ఓ క్లారిటీ లేదు. గతంతో పోలిస్తే చంద్రబాబు ఈ సారి కాస్త ముందస్తుగానే టిక్కెట్ల ఖరారులో మేల్కొన్నా ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలు మాత్రం టీడీపీని షాక్ కు గురిచేశాయనే చెప్పొచ్చు. అయితే ఈ పరిస్థితిని చంద్రబాబు ఎంత వరకూ ‘టైమ్ మేనేజ్ మెంట్’తో అధిగమిస్తారో వేచిచూడాల్సిందే.

ఇక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే పాదయాత్ర ద్వారా ఆయన ఇఫ్పటికే ఏపీలో మెజారిటీ నియోజకవర్గాలను కవర్ చేశారు. పాదయాత్రతో కవర్ కాని నియోజకవర్గాలకు జగన్ బస్సు యాత్ర ప్లాన్ చేసినా ఇప్పుడు అంత సమయం లేదు. టీడీపీ తరహాలోనే జగన్ కూడా టిక్కెట్ల ఖరారు విషయంలో కొంత ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షెడ్యూల్ వచ్చిన రోజుల్లోనే అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తానని జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అటు చంద్రబాబు, ఇటు జగన్ లు పరుగులు పెట్టాల్సిందే. వీళ్ళతోపాటు పోటీచేసే అభ్యర్ధులు పార్టీ నేతలు కూడా అదే బాట పట్టాల్సిందే. లేకపోతే ఎన్నికల పరుగు పందెంలో నెగ్గటం కష్టం కదా?. చూడాలి మరి ఈ పరుగులో విజేతగా ఎవరు నిలుస్తారో.

Next Story
Share it