సిట్టింగ్ లను మార్చకపోతే చంద్రబాబుకు కష్టమే
తెలుగుదేశం ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 40 శాతం సిట్టింగ్ లకు సీట్లు మార్చకపోతే గెలవటం కష్టం అని...మార్చితే ఆయనే సీఎం అని స్పష్టం చేశారు. చంద్రబాబును తనను చూసి ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని అది జరిగే పనికాదన్నారు. తమకు ఎమ్మెల్యేలే కలెక్టర్, ఎమ్మెల్యేనే ఎస్పీ, ఎమ్మెల్యేనే ఇంజనీర్ అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో చంద్రబాబును చూసేది ఎవరు అని ప్రశ్నించారు. కనీసం 30 నుంచి 40 శాతం మంది సిట్టింగ్ లను మార్చాల్సి ఉంటుందని అన్నారు.
అధికార పార్టీలో చాలా మంది సిట్టింగ్ లకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పలు జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. సిట్టింగ్ లకు సీట్లు ఇస్తే తామే వాళ్ళను ఓడిస్తామని సొంత పార్టీ నేతలే ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో జే సీ దివాకర్ రెడ్డి ఈ ప్రకటన చేయటం విశేషం. ఎన్నికల ముందు జే సీ వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.