Telugu Gateway
Politics

చంద్రబాబు ‘రాజధాని కుట్ర’ బట్టబయలు

చంద్రబాబు ‘రాజధాని కుట్ర’ బట్టబయలు
X

అమరావతి పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్ర బట్టబయలైంది. రాజధాని కోసం అంటూ రైతుల దగ్గర నుంచి అత్యంత విలువైన భూములు దక్కించుకున్న చంద్రబాబు సర్కారు ఇందులో భూములను కంపెనీలు పెట్టి మరీ ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారం చేస్తుందన్న వివరాలు బహిర్గతం అయ్యాయి. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు ఈ దందా కోసం ఏకంగా విదేశీ గడ్డ అయిన సింగపూర్ లో సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్స్ పిటీఈ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ఇన్ కార్పొరేట్ చేశాయి. దానికి అనుబంధంగా ఓ సంస్థను విజయవాడలో నెలకొల్పారు. దాని పేరే అమరావతి డెవలప్ మెంట్ పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాని ప్రధాన వ్యాపారం ఏమిటో ఈ ఐటెంలోని ‘ఫోటోలో’ స్పష్టంగా చూడవచ్చు. అది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది తప్ప..రాజధాని నిర్మాణం కానీ..అభివృద్ధిలో కానీ అది ఏ మాత్రం భాగస్వామి కాదు. అయినా సరే చంద్రబాబు నాయుడు సింగపూర్ అద్భుతాలు అంటూ ఏకంగా రాజధాని రైతులు ఇచ్చిన భూముల్లో ఏకంగా 1691 ఎకరాలు కట్టబెడుతూ జీవోలు జారీ చేశారు.

అందులో 5000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ సర్కారే మౌలికసదుపాయాలు కల్పిస్తుంది. అంటే ఈ కంపెనీలు చేసుకునే వ్యాపారానికి ప్రజల సొమ్ము అన్న మాట. తీరా ఈ సింగపూర్ కంపెనీలు ఏమి చేస్తాయా? అని చూస్తే సొంత లేదా లీజుకు తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం. స్థలాన్ని ఫ్లాట్లుగా చేసి అమ్మకాలు. అపార్ట్ మెంట్లు, నాన్ రెసిడెన్షియల్ భవనాల నిర్మాణం వంటి అని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో అమరావతిలో అద్భుతమైన రాజధాని నిర్మిస్తారని చెప్పిన సింగపూర్ సంస్థలు చేసే వ్యాపారం ఏంటో తేటతెల్లం అయింది. అసలు ఈ కంపెనీలకు రాజధాని నిర్మాణంలో ఎలాంటి భాగస్వామ్యం లేదు. కానీ చంద్రబాబు మాత్రం రాజధాని పేరు చెప్పి..అద్భుతమైన బొమ్మలు చూపించి ప్రజలను వంచించటం ద్వారా ఈ సంస్థలకు ఏకంగా వేల కోట్ల భూములను..ప్రజల ఆస్తులను దోచిపెట్టడానికి రెడీ అయిపోయారు.

Next Story
Share it