Telugu Gateway
Politics

వైసీపీలో చేరిన మోహ‌న్ బాబు

వైసీపీలో చేరిన మోహ‌న్ బాబు
X

ప్ర‌ముఖ న‌టుడు. విద్యా సంస్థ‌ల అధినేత మోహ‌న్ బాబు వైసీపీలో చేరారు. మంగ‌ళ‌వారం నాడు హైద‌రాబాద్ లో వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. అంతే కాదు..ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా పర్య‌టించి వైసీపీ త‌రపున ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌న్నారు. వైసీపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పదవీచ్యితుడయిన తరువాత ఆయన వద్దు అంటున్నా మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా తీసి.. వందల సభల్లో పాల్గొని ఆయన గెలుపుకోసం కృషి చేశానన్నారు. తర్వాత పలు సందర్భాల్లో బీజేపీకి సపోర్ట్ చేసినా పార్టీలో మాత్రం చేరలేదన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు త్వరలో ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ‘పదవులు కావాలంటే గతంలోనే పార్టీలో చేరేవాడిని. తనకు అలాంటి కోరిక లేదు, జగన్‌ నా బంధువని ఈ పార్టీలో చేరలేదు. తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు, చేయబోతున్నాడు.

జగన్‌ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే ఈ పార్టీలో చేరాన’ని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై మోహన్‌బాబు స్పందిస్తూ.. ‘దాదాపు మూడు నాలుగేళ్లుగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడాను. తరువాత ఉత్తరాలు రాశాను కానీ సరిగ్గా స్పందించలేదు. ఈ నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబు మట్టి, ఇసుక, భూములను దోచుకుని భూస్వామి అయ్యాడు. ప్రారంభంలో నీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత. 1975 నుంచి నా సంపాదన వివరాలు ఇస్తా... చంద్రబాబు ఇవ్వగలడా’ అని మోహన్‌బాబు సవాల్‌ విసిరారు. 19 కోట్లకు పైగా రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రావాల్సి ఉందని, ఆస్తులు తాకట్టు పెట్టి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నా అని తెలిపారు తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారన్న పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై మోహన్‌బాబు స్పందించారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజల మీద ఎవరూ దాడి చేయటం లేదు, చేయరు కూడా అన్నారు.

Next Story
Share it