Telugu Gateway
Politics

దేశ అభిమానం అండగా..భారత్ లోకి అభినందన్

దేశ అభిమానం అండగా..భారత్ లోకి అభినందన్
X

దేశ అభిమానమే కొండంత అండగా..అభినందన్ సగర్వంగా భారత్ లోకి అడుగుపెట్టారు. శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్ జయ జయద్వానాల మధ్య సురక్షితంగా భారత్ లోకి అడుగుపెట్టారు. పాకిస్తాన్‌ అధికారులు అభినందన్‌ను శుక్రవారం రాత్రి అట్టారీ–వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. వైమానిక దళ అధికారులు, వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డాక్యుమెంటేషన్, విధానపర ప్రక్రియ కారణంగా ఆయన అప్పగింత కొన్ని గంటల పాటు ఆలస్యమైంది. స్వదేశం తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అభినందన్‌ను వెంటనే ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లారు. తరువాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక విమానంలో అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి తరలించారు. ఆర్మీ, నిఘా అధికారుల పర్యవేక్షణలో శనివారం అభినందన్‌ మానసిక, భౌతిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు.

అభినందన్‌ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు అభినందన్‌ స్వదేశం చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అభినందన్‌ యుద్ధఖైదీయే అని ఆయన్ని అప్పగించిన తరువాత పాకిస్తాన్‌ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్‌ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్‌–21 విమానం కూలిపోయి అభినందన్‌ పాకిస్తాన్‌ బలగాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్‌ను ఆయన్ని విడుదలచేసేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తొలగిపోయేందుకు ముందడుగు పడినట్లయింది.

Next Story
Share it