Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ‘సర్వేల’ స్పెషలిస్ట్ కు 1400 కోట్ల కాంట్రాక్ట్!

ఏపీలో ‘సర్వేల’ స్పెషలిస్ట్ కు 1400 కోట్ల కాంట్రాక్ట్!
X

బినామీ సంస్థ. బినామీ కాంట్రాక్ట్. ఏపీ ప్రభుత్వంలోని పెద్దల లక్ష్యం ఆ సర్వేల ‘స్పెషలిస్ట్’కు మేలు చేసి పెట్టడం. తమ కోసం పనిచేస్తున్న ఆయన్ను ఎలాగోలా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించటం. పనిలో పనిగా అదే పనిలో తాము కొంత వెనకేసుకోవటం. ఇదీ అంతిమ లక్ష్యం. ఏపీ ప్రభుత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా ‘టెండర్ల’ వ్యవస్థ నవ్వుల పాలు అవుతోంది. పైకి అంతా పారదర్శకంగానే చేసినట్లు కన్పించినా..ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా ఏ పని ముందుకు సాగదు. ఏ పని ఎవరికి ఇవ్వాలో ముందే ఫిక్స్ చేస్తారు. దీనికి పకడ్బందీ ప్లాన్ రచిస్తారు. దాని ప్రకారమే అంతా అయిపోతుంది. ప్రస్తుతం తమకు ఉపయోగపడుతున్న ఈ నేతకు అనంతపురం జిల్లాలోని ఓ ప్రాజెక్టు కు చెందిన 1400 కోట్ల రూపాయల పనులు అప్పగించాలని సర్కారు నిర్ణయించింది.

నేరుగా ఇస్తే విమర్శలు వస్తాయని భావించి దీని కోసం ఓ బినామీ కంపెనీని తెరపైకి తెచ్చారు.. దీని ద్వారా పనికానిచ్చేస్తున్నారు. ఈ పని విలువ ఏకంగా 1400 కోట్ల రూపాయలు. అంటే పని మొత్తంలో పది శాతం లాభం వేసుకున్నా అంతిమంగా కేవలం లాభమే 140 కోట్ల రూపాయలు ఉండనుంది. ఇందులో అంచనాల పెంపు..గోల్ మాల్ వ్యవహారాలు ఎన్నో. అంతిమంగా ఈ ప్రాజెక్టు ద్వారా తమకు కావాల్సిన వ్యక్తికి భారీగా మేలు చేసి పెట్టి ఈ ఎన్నికల్లో అతని సేవలు వాడుకోవటం..అందుకు అవసరమయ్యే మొత్తాన్ని దీని ద్వారా సర్దుబాటు చేయటం అంతిమ లక్ష్యంగా చెబుతున్నారు.

Next Story
Share it