కర్నూలు టీడీపీకి ఎదురుదెబ్బ
ముందు ప్రకాశం. తర్వాత వైజాగ్. ఇప్పుడు కర్నూలు జిల్లా. ఇలా అధికార తెలుగుదేశం పార్టీకి కీలక నేతలు షాక్ ఇస్తున్నారు. ఈ పరిణామాలతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న పార్టీకి వరస పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో శనివారం ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాంపుల్లారెడ్డి సోదరులు కలిశారు. వైఎస్ జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీలో చేరిక అనంతరం రాంపుల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని రాంపుల్లారెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఓ సైనికుడిగా పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపుకు కృషి చేస‍్తామని ఆయన పేర్కొన్నారు. తమ కార్యకర్తలు కూడా తమ బాటలోనే నడుస్తారని చెప్పారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని, గంగుల కుటుంబంతో తమకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని రాంపుల్లారెడ్డి తెలిపారు.