హీరోగా రకుల్ తమ్ముడు
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఆదివారం నాడు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. దాసరి లారెన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను షేక్ షా వలి సమర్పణలో రజిని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై మావురం రజిని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన ముహూర్తపు సన్నివేశానికి రకుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్టగా, హీరో సందీప్ కిషన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు లక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయ సమావేశంలో... రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘నా సోదరుడు అమన్ హీరోగా సినిమా ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం తనకు హీరో కావాలనుందని చెప్పగానే.. ప్యాషన్ ఉందా? ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలని తనతో అన్నాను. తను ప్యాషన్ ఉందని చెప్పాడు. ఎంతో పట్టుదలగా తెలుగు నేర్చుకుని తన ప్యాషన్ ఏంటో చూపించాడు. నాకు హైదరాబాద్ హోం టౌన్ ఎలా అయ్యిందో.. అమన్‌కు కూడా ఇప్పుడు హైదరాబాద్ హోం టౌన్‌లా మారింది. తను మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడని భావిస్తున్నాను’ అన్నారు.