Telugu Gateway
Top Stories

అభినంద‌న్ విడుద‌ల‌కు పాక్ గ్రీన్ సిగ్న‌ల్

అభినంద‌న్ విడుద‌ల‌కు పాక్ గ్రీన్ సిగ్న‌ల్
X

భార‌త్-పాక్ ల మధ్య ఉద్రిక్త‌త‌లు తీవ్ర స్థాయిలో ఉన్న త‌రుణంలో కీల‌క మ‌లుపు. పాక్ కు చిక్కిన భార‌త పైల‌ట్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ ను విడుద‌ల చేయ‌టానికి పాక్ అంగీక‌రించింది. ఈ మేర‌కు ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పార్ల‌మెంట్ లో ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం నాడు అభినంద‌న్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు తాము చేస్తున్న ప‌నిని చేత‌కానిత‌నంగా చూడొద్ద‌ని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. యుద్ధం ప‌రిష్కారం కాద‌ని..ఉద్రిక్త‌త‌లు ఎవ‌రికీ మేలు చేయ‌వ‌ని వ్యాఖ్యానించారు. భార‌త్ తో తాము శాంతినే కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. అదే స‌మ‌యంలో ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు కూడా చేశారు. భార‌త్ ఎంత‌సేపూ ఐదు నిమిషాల పుల్వామా ఘ‌ట‌న గురించే మాట్లాడుతుంది కానీ..19 ఏళ్ల యువ‌కుడు మాన‌వ బాంబుగా ఎందుకు మారాడో ఆలోచించ‌టంలేద‌ని విమ‌ర్శించారు. అంత‌కు ముందు భార‌త్ గ‌ట్టిగా పాక్ ను త‌న సందేశాన్ని పంపింది. భారత పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను విడిపించుకోవడానికి పాకిస్థాన్‌తో ఎలాంటి ఒప్పందం​ చేసుకోబోమని, బేషరతుగా వెంటనే అభినందన్‌ను పాక్‌ భారత్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అభినందన్‌ విషయంలో కాందహర్‌ విమానం హైజాక్‌ ఘటన తరహాలో ఇచ్చిపుచ్చుకునేవీ ఏమీ ఉండవని తెలిపింది. పాక్‌ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులు, వారి ముసుగులపై పాకిస్థాన్‌ సత్వరమే తగిన చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే 40మందిని పొట్టనబెట్టుకున్న పూల్వామా ఉగ్రవాద దాడికి సంబంధించిన ఆధారాలను పాక్‌ రాయబారికి భారత్‌ అందజేసింది. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన మాట నిలబెట్టుకోవాలని, భారత్‌ ఇచ్చిన ఆధారాలపై దర్యాప్తు జరపాలని కేంద్రం పేర్కొంది. భారత్‌ పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేసిందని, కానీ, పాకిస్థాన్‌ భారత్‌లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రయత్నించిందని కేంద్రం గుర్తు చేసింది.

Next Story
Share it