బాలకృష్ణకు మరో ఎదురుదెబ్బ!
నందమూరి బాలకృష్ణ ఏ సినిమాకు ఇంతటి దారుణంగా కలెక్షన్లు వచ్చి ఉండవు. అందునా ఎన్టీఆర్ వంటి ఓ లెజండ్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తే ఇంతటి దారుణమైన ఫలితాలు రావటం కలకలం రేపుతోంది. మహానాయకుడి సినిమాతో పోలిస్తే కథానాయకుడికే ఎంతో మెరుగైన కలెక్షన్లు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. సహజంగా పెద్ద హీరోల సినిమాలకు తొలి రోజు కలెక్షన్లు దుమ్మురేపుతాయి. తర్వాత వచ్చే టాక్ ను బట్టి మిగతా వసూళ్ళు ఆధారపడి ఉంటాయి. కానీ మహానాయకుడి సినిమాకు తొలి రోజు ఏపీ, తెలంగాణలో కలపి కేవలం 65 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని ఫిల్మ్ సర్కిల్స్ టాక్.
ఎన్టీఆర్ సొంత జిల్లా అయినా కృష్ణాతోపాటు గుంటూరు జిల్లాల్లో కలెక్షన్లు దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. ఒవర్సీస్ లోనూ ఇదే పరిస్థితి. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావటంతో సినిమాకు ముగింపు పలకటం ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదనే చెప్పొచ్చు. కథానాయకుడు సినిమాకు ఫుల్‌రన్‌లో రూ. 50 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే మహానాయకుడుకు కూడా భారీ నష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలకృష్ణ స్వయంగా నిర్మాణ సంస్థ పెట్టి ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.