వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విడుదల
చెప్పినట్లుగానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘డైరక్ట్ ఎటాక్’ చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ లో వాస్తవ ఘటనలను చూపించారు. అంతే కాదు..అందులో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు, దివంగత హరికృష్ణ, మోహన్ బాబుల గొంతులు కూడా పెట్టేశారు. గురువారం ఉదయం ట్రైలర్ ముహుర్తానికి సంబంధించి పత్రికల్లో ఫుల్ పేజీల ప్రకటన ఇవ్వటం కూడా కలకలం రేపుతోంది. భారీ బడ్జెట్లతో తెరకెక్కిన బడా బడా హీరోల ట్రైలర్ల విడుదలకు కూడా ఎప్పుడూ ఇంత పెద్ద ప్రకటనలు ఇచ్చిన చరిత్ర లేదు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వర్మ ట్రైలర్ కే ఫుల్ పేజీల ప్రకటనలు ఇచ్చారు. ఈ ఫ్రచారం ప్రభావమే అన్నట్లు ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళుతోంది. రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమానే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్.
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అసలు కథ ఇదేనంటూ వర్మ ప్రచారం చేస్తున్నారు. నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నమ్మడం’అంటూ ముగుస్తుంది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్‌లో చూపించాడు వర్మ. సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ఒక రోజు ముందు ‘ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. రేపు మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు’అంటూ వర్మ ట్వీట్ చేశారు.
https://www.youtube.com/watch?time_continue=188&v=WbtiDxR1DZY