Telugu Gateway
Politics

టార్గెట్ ‘మసూద్ అజర్’

టార్గెట్ ‘మసూద్ అజర్’
X

పాక్ విషయంలో భారత్ ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఓ వైపు నేరుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సమాధానం చెబుతూనే..మరో వైపు అంతర్జాతీయ సమాజం తరపు నుంచి కూడా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచే చర్యలు చేపడుతోంది. దీని ద్వారా సత్ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పీవోకెలోని జైషే అహ్మద్ ఉగ్ర క్యాంపులపై భారత్ వైమానిక దళంతో దాడి చేయటాన్ని ఏ ఒక్క దేశం అభ్యంతరం చెప్పకపోవటంతోనే భారత్ వ్యూహం ఇమిడి ఉంది. తాము కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశామనే సంకేతాలను ప్రపంచానికి పంపి వాళ్ల మద్దతు పొందగలుగుతోంది. ఇప్పుడు అదే దిశగా మరో ముందడుగు వేసింది. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి ఘటనలో ప్రమేయమున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్ మసూద్ అజహర్ ను బ్లాక్‌లిస్ట్‌ లో ఉంచాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. అయితే మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్‌పై చైనా ప్రతికూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌,అమెరికా, ఫ్రాన్స్‌ ల తాజా వైఖరిపై చైనా ఇంకా స్పందించలేదు.

మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని, ఆయన ఆస్తులను సీజ్‌ చేయాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లు పదిహేను మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్‌ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. కాగా ఏకాభిప్రాయంపై నిర్ణయం తీసుకునే కమిటీలో ఈ ప్రతిపాదనపై మార్చి 13లోగా సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. గతంలో 2017లో మసూద్‌ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌ లో పెట్టాలని భద్రతా మండలి కమిటీ ఎదుట ప్రతిపాదన వచ్చిన క్రమంలో ఉగ్రవాదిగా ఓ సంస్థ లేదా వ్యక్తిని నిర్వచించేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయని, ఈ నిబంధనలను సంబంధిత ఐరాస కమిటీ క్షుణ్ణంగా పరిశీలించాలంటూ ఈ ప్రతిపాదనకు చైనా మోకాలడ్డింది. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it