అమరావతిలో ‘టీటీడీ ఆలయం’
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో తిరుమల తరహాలో వెంకటేశ్వరస్వామి దేవాలయం రానుంది. ఈ మేరకు ఇఫ్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నిర్ణయం కూడా తీసుకుంది. వంద కోట్ల రూపాయల పైబడిన అంచనా వ్యయంతో ఈ దేవాయలం నిర్మించనున్నారు. ఈ దేవాలయ పనులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. రాజధాని గ్రామం వెంకటపాలెం దగ్గర ఈ దేవాలయం నిర్మించనున్నారు.
గురువారం ఉదయం సీఎం చంద్రబాబు భూకర్షణం, బీజవాపనం కార్యక్రమాలు నిర్వహించి ఆగమయోక్తంగా పనులకు శ్రీకారం చుట్టారు. రెండేళ్ల పాటు 25 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం, ఉపాలయాలు, కళ్యాణమండపాల నిర్మాణాలు, ద్రవిడ శిల్ప రీతులతో జరుగనున్నాయి. భూకర్షణంలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహించనున్నారు. భూకర్షణం తర్వాత పదిరోజుల పాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి. అనంతరం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.