Telugu Gateway
Telangana

తెలంగాణ మంత్రివర్గ ఏర్పాటునూ కాంగ్రెసే అడ్డుకుందా?

తెలంగాణ మంత్రివర్గ ఏర్పాటునూ కాంగ్రెసే అడ్డుకుందా?
X

ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ చెప్పిన కారణం. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పదే పదే పాలనకు అడ్డుపడుతుందని..ఎన్నికలు పూర్తయితే ఇక పరిపాలన జామ్ జామ్ అంటూ ముందుకు సాగుతుందని ప్రకటించారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్య మెజారిటీతో గెలిచినా తెలంగాణ రాష్ట్రంలో ‘పరిపాలన’ మాత్రం ముందుకు సాగటం లేదు. పలు శాఖల అధికారులు ‘డైరక్షన్’ లేక మౌనంగా చూస్తూ కూర్చుండిపోతున్నారు. ఒక్క మాటలో వివరించాలంటే పాలన పూర్తిగా పడకేసిందనే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటిపోయింది. కానీ ఇంత వరకూ పూర్తి స్థాయి మంత్రివర్గ ఏర్పాటే జరగలేదు. ఎప్పుడు జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు.

కెసీఆర్ తో పాటు ఒక్క మహమూద్ అలీ మాత్రమే మంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు కూడా కాంగ్రెస్ పార్టీనే అడ్డుపడుతుందా?. రాష్ట్రంలో పరిపాలన అంటే కేవలం ఒక్క సాగునీటి ప్రాజెక్టులను పరుగెత్తించటం ఒక్కటేనా?. మిగిలిన శాఖలు అంతా నామ్ కే వాస్తేనా? మంత్రివర్గ విస్తరణ జాప్యం చేయటం వల్ల అత్యంత కీలకమైన సమయం వృధా అవుతుందని..ఈ నెలలో మంత్రివర్గం ఏర్పాటై ఉంటే..రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు దక్కేదని.. మళ్లీ లోక్ సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే మంత్రివర్గం ఉన్నా కూడా ఎలాంటి విధాన నిర్ణయాలకు ఛాన్స్ ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మంచి రోజులు లేవనే కారణంతో కెసీఆర్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ లోగానే కెసీఆర్ కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అంటే మంచి రోజులు కేవలం మంత్రివర్గ విస్తరణకు మాత్రమే చూస్తారా?. మిగిలిన వాటికి చూడరా?. అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అంతే కాదు..ప్రజలు అద్బుత మెజారిటీతో గెలిపించిన దానికంటే మంచి రోజు ఇంకేమి ఉంటుందని ఓ సీనియర్ నేత నిట్టూర్చారు. గత కేబినెట్ లో మంత్రులుగా చేసిన వారికీ..ప్రస్తుతం మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కూడా ‘విస్తరణ’పై ఎలాంటి సమాచారం లేక టెన్షన్ టెన్షన్ తో గడుపుతున్నారు. పలు శాఖలు ప్రస్తుతం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నాయని..ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it