Telugu Gateway
Telangana

జనవరి 17న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం..18న స్పీకర్ ఎన్నిక

జనవరి 17న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం..18న స్పీకర్ ఎన్నిక
X

తెలంగాణ నూతన శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. అదే సమయంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు సంబంధించి కూడా తేదీలు కూడా ఫైనల్ అయ్యాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంత కాలం మంచి రోజులు లేవనే కారణంతో మంత్రివర్గ ఏర్పాటుతోపాటు అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయని విషయం తెలిసిందే. పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలంలో, ఏకాదశి శుభ తిదినాడు, బుధవారం జనవరి 17, 2019 న శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు రోజు దశమి తిధి, జనవరి 16, 2019 న సాయంత్రం 5 గంటలకు, కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యుల్లో సీనియర్ అయిన చార్మీనార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజ భవన్ లో ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ప్రమాణం చేయిస్తారు.

ఆ మర్నాటి నుండి నూతన శాసనసభ కార్యకాలపాలు ప్రారంభం అవుతాయి. ప్రజలు గొప్ప మెజారిటీతో తమను గెలిపించారని, ఆ స్పూర్తితో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి తిథినాడు శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శాసనసభ కార్యకలాపాలు 17 జనవరి నుండి 20 జనవరి వరకు ఉంటాయి. ప్రోటెం స్పీకర్ శపథ స్వీకారం తీసుకున్న మరుసటి రోజు, జనవరి 17, 2019 న అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11-30 గంటలకు ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ఆ తరువాత ఒకరివెంట ఒకరు శపథస్వీకారం చేస్తారు.

ఈ కార్యక్రమం సుమారు రెండుగంటలు కొనసాగుతుంది. ఆ మధ్యాహ్నం జూబిలీహాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్ లో శాసనసభ సభ్యులకు లంచ్ ఏర్పాటు చేస్తారు. అదే రోజున స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు వుంటాయి. జనవరి 18, 2019 న స్పీకర్ ఎన్నిక, ఎన్నికైనట్లు ప్రకటన వుంటాయి. ఆ తరువాత నూతనం ఎన్నికైన స్పీకర్ ను, సభానాయకుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ శాసనసభా పక్ష నాయకులు స్పీకర్ స్థానానికి తోడ్కొని పోతారు. అ తరువాత నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభాకార్యక్రమాలు సాగుతాయి. ఆ తరువాత స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. మర్నాటి గవర్నర్ ప్రసంగం విషయంలో బీఎసీ నిర్ణయం తీసుకుంటుంది. జనవరి 19, 2019 న శాసనసభనుద్దేసించి గవర్నర్ ప్రసంగం వుంటుంది. ఆ మర్నాడు జనవరి 20, 2019 న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది.

Next Story
Share it