నరసరావుపేట సీటు సిద్ధాకు..రాయపాటికి చంద్రబాబు చెక్ !?
‘రాజకీయాల్లో ఒకప్పుడు మాకు ఆ నియోజకవర్గంలో చాలా మంది తెలుసు. టిక్కెట్ ఇవ్వండి అని అడిగే వారు. ఇప్పుడు పూర్తి రివర్స్. నేను ఆ నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు. టిక్కెట్ ఇవ్వండి అని అడుగుతున్నారు’. ఇదీ ఓ సీనియర్ టీడీపీ నేత కామెంట్. ఏపీ అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు ప్రస్తుతం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ సీటు ఇస్తే భారీ మెజారిటీతో ఓటమి ఖాయం అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనూ ఆయన ‘భారీ’ ఎత్తున ఖర్చు చేసి మరీ విజయం దక్కించుకున్నారు. ఇఫ్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే సిద్ధా రాఘవరావును టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నరసరావుపేట పార్లమెంట్ బరిలో దింపాలనే యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావుకు హ్యండ్ ఇవ్వటం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రాయపాటి సాంబశివరావు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటం. మరొకటి వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఆయన దగ్గర లేకపోవటం.
అందుకే ఆర్థికంగా శక్తివంతమైన సిద్ధా రాఘవరావును నరసరావుపేట పంపించటం ద్వారా ‘సర్దుబాట్లు’ చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు దక్కించుకున్న ‘ట్రాన్స్ స్ట్రాయ్’ చంద్రబాబు కోసం ఎన్నో ‘త్యాగాలు’ చేసినందున సీటు ఇవ్వకపోతే రాయపాటి సాంబశివరావు మౌనంగా కూర్చుంటారా?. అసలు విషయాలు అన్నీ బహిర్గతం చేస్తారా? అన్న టెన్షన్ కూడా పార్టీ వర్గాల్లో ఉంది. అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా రాయపాటి తనయుడికి అసెంబ్లీ సీటు ఇవ్వటం ద్వారా సమస్య నుంచి బయటపడాలనేది చంద్రబాబు ప్లాన్ గా చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి ఏపీలో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాలంటే భారీ ఎత్తున సీట్లు మార్చాల్సిన పరిస్థితి ఉందని..అయితే ఇది ఎంత మేర సాఫీగా సాగుతుంది?. టిక్కెట్ దక్కని వారు మౌనంగా ఉంటారా?. లేక తిరుగుబాటు జెండా ఎగరేస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.