Telugu Gateway
Telangana

హరీష్ రావు పాత్రలోకి ‘సంతోష్ కుమార్’!

హరీష్ రావు పాత్రలోకి ‘సంతోష్ కుమార్’!
X

సంతోష్ కుమార్. రాజ్యసభ సభ్యుడు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి. కెసీఆర్ తొలి దఫా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన అపాయింట్ మెంట్స్ తోపాటు అంతరంగిక విషయాలను చూస్తూ సంతోష్ టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా మారారు. ఆ సమయంలో కూడా తొలి మూడున్నర సంవత్సరాలు హరీష్ హవా తిరుగులేకుండానే సాగించింది. గత ఎన్నికలకు ఏడాది ముందు నుంచే హరీష్ రావు ప్రాభవానికి కోత పడుతూ వచ్చింది. ఇప్పుడు అయితే టీఆర్ఎస్ లో అత్యంత కీలకనేతగా ఉన్న హరీష్ రావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందస్తు ఎన్నికల్లో అప్రతిహత విజయం తర్వాత కెసీఆర్ ఎవరూ ఊహించని రీతిలో కెటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. తన వారసుడిగా కెటీఆర్ ను అధికారికంగా ప్రకటించి..హరీష్ కు చెక్ పెట్టడం కోసమే ఈ నిర్ణయం అని అందరికీ తెలిసిందే. గత ఎన్నికల వరకూ కూడా కెసీఆర్ హరీష్ రావుకు పలు కీలక బాధ్యతలు అప్పగించారు.

హరీష్ లేకుండా టీఆర్ఎస్ రాజకీయం లేదనేలా పరిస్థితి ఉండేది ఒకప్పుడు. తాజాగా ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో జరిగిన చర్చలకు వెళ్ళిన కెటీఆర్ అండ్ టీమ్ లో అసలు హరీష్ రావు లేనేలేరు. కెటీఆర్ పాటు వినోద్ కుమార్, సంతోష్ కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఎర్రవల్లిలో సాగుతున్న యాగంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఓ అతిధిగానే హాజరై వచ్చినట్లున్నారు తప్ప అక్కడ ఆయన హంగామా ఎక్కడా కన్పించలేదు. కానీ యాగం దగ్గర అంతా కెటీఆర్ తో పాటు సంతోష్ హడావుడే కన్పిస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల్లో ఈ అంశంపైనే హాట్ హాట్ చర్చ నడుస్తుంది.

హరీష్ రావు పాత్రను సంతోష్ పోషిస్తున్నారని..కెసీఆర్, కెటీఆర్ లు ఇప్పుడు సంతోష్ కు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. అయితే రాజకీయ వ్యూహాలు అమలు చేయటంలో హరీష్ రావుకు దిట్ట అని పేరుంది. మరి సంతోష్ రాజకీయంగా అంత చాణిక్యం చూపగలరా? లేదా అన్నది ఇప్పటి వరకూ ఎక్కడా అవకాశం రాలేదు..ప్రూవ్ కాలేదు. హరీష్ ప్లేస్ ను క్రమ క్రమంగా సంతోష్ కు అప్పగించేందుకు రంగం సిద్ధం అయిందనే చర్చ మాత్రం పార్టీలో జోరుగా సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే కానీ..ఇంకా ఎన్ని కొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it