టీజీపై పవన్...చంద్రబాబు ఆగ్రహం

తెలుగుదేశం పార్టీలో ‘టీజీ దుమారం’ సాగుతోంది. జనసేన-టీడీపీల పొత్తుకు సంబంధించి మార్చిలో చర్చలు జరిగే అవకాశం ఉందని ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..ఆయన ఓ అడుగు ముందుకేసీ ఉత్తరప్రదేశ్ లో బద్ధవిరోధులైన ఎస్పీ, బీఎస్పీలు కలవగా లేనిది...జనసేన, టీడీపీ కలిస్తే తప్పేంటని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే టీజీ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించాయి. టీడీపీ ఎంపీ చేసిన కామెంట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. టీజీ వెంకటేష్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. తాను వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటు తెచ్చుకున్న టీజీకి బుద్ధి చెబుతానని పవన్ వ్యాఖ్యానించారు. విశాఖపట్టణం జిల్లా పాడేరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెద్దమనిషి అని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. నేను నోరు అదుపు తప్పితే మీరు ఏమవుతారో తెలియదు.’’ అంటూ గర్జించారు. పారిశ్రామికవేత్తగా నదులు, పర్యావరణాన్ని టీజీ వెంకటేష్ కలుషితం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమంటూ జనసేనాని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విధానపరమైన నిర్ణయాలపై పార్టీ నేతలు ఎలాపడితే అలా మాట్లాడటం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఆచితూచి వ్యవహరించాలని హెచ్చరించారు.