Telugu Gateway
Andhra Pradesh

‘ఐఏఎస్’ ఇప్పించటానికి ‘ఐదు’ కోట్లు తీసుకున్న సీనియర్ ఐఏఎస్!

‘ఐఏఎస్’ ఇప్పించటానికి ‘ఐదు’ కోట్లు తీసుకున్న సీనియర్ ఐఏఎస్!
X

నాన్ రెవెన్యూ విభాగంలో ఐఏఎస్ పోస్టులను దక్కించుకునేందుకు పోటీ గట్టిగానే ఉంటుంది. ఇందులో సిఫారసులు కూడా పనిచేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే అవి పైకి ఏ మాత్రం కన్పించవు. అంతా లోలోపలే జరిగిపోతుంటాయి. తాజాగా ఐఏఎస్ పోస్టుల కోసం ఏపీకి చెందిన అధికారుల ఎంపిక..సిఫారసుల విషయంలో ఎన్నో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వంలోని ముఖ్యనేత, కీలక మంత్రి, ముఖ్య నేత సన్నిహితుడు చేసిన సిఫారసులు మాత్రం బుట్టదాఖలా అయ్యాయి. కానీ విచిత్రంగా అదే ముఖ్యనేత దగ్గర పనిచేస్తున్న ఓ ‘ముఖ్య’ అధికారి మాత్రం తనకు కావాల్సిన వ్యక్తికి ఐఏఎస్ ఇప్పించుకున్నారు. ఇది ఒకెత్తు అయితే సాక్ష్యాత్తూ ముఖ్య నేతను కాదని..మాజీ సీఎస్ ఒకరు తనకు కావాల్సిన వ్యక్తికీ ఐఏఎస్ ఇప్పించుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. మరో పోస్టు రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి సిఫారసుతో భర్తీ అయిందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాన్ రెవెన్యూ ఐఏఎస్ పోస్టుల ఎంపికకు సంబంధించి దినేష్ కుమార్ సీఎస్ గా ఉన్న సమయంలోనే మెరిట్ లిస్ట్ తయారు చేశారు. అయితే ఆయన పదవి విరమణ తర్వాత ఈ జాబితాలో మార్పులు..చేర్పులు జరిగాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

అన్నింటి కంటే విచిత్రం ఏమిటంటే సర్కారుపై నిత్యం దుమ్మెత్తిపోసే మాజీ సీఎస్ ఢిల్లీలో లాబీయింగ్ చేసి తనకు కావాల్సన వ్యక్తికి ఐఏఎస్ దక్కేలా చూసుకోగలిగితే..ముఖ్యనేత, కీలక మంత్రి చేసిన సిఫారసులకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఇది కూడా అధికారుల్లో పెద్ద చర్చకు కారణం అయింది. ముఖ్య నేత దగ్గర పనిచేసే ‘ముఖ్య’ అధికారి కూడా తనకు కావాల్సిన వ్యక్తికి పోస్టింగ్ ఇఫ్పించుకున్నారు. అయితే ఇందుకు గాను ఆయనకు కోట్ల రూపాయల మొత్తంలో ముట్టచెప్పినట్లుగా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన మెరిట్ జాబితా ప్రకారం యూపీపీఎస్సీ ఇంటర్వ్యూలు చేసి అభ్యర్ధులను ఎంపిక చేస్తుంది. అయితే ఇందులో చాలా వరకూ సిఫారసులు పనిచేయటం సహజమే అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. గతంలోనూ ఎన్నోసార్లు ఇలా సిఫారసులతో నాన్ రెవెన్యూ విభాగంలో ఐఏఎస్ పోస్టులు పొందిన వారు ఎంతో మంది ఉన్నారని తెలిపారు.

Next Story
Share it