ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా జగన్
ఈ నియామకం చేసింది ఎవరో తెలుసా?. ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఆయన శుక్రవారం నాడు ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏపీలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. వైసీపీ ఆంధ్రా టీఆర్ఎస్ పార్టీగా మారిందని లేఖలో మంత్రి పేర్కొన్నారు. జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవటం నైతికతా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.
రాఫెల్ కుంభకోణంపై జగన్, కెసీఆర్ లు ఎందుకు నోరు మెదపటం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. పోలవరం బకాయిలు, ఉపాధి హామీ నిధులపై కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించరన్నారు. టీఆర్ఎస్, వైసీపీ లాలూచీని తాజాగా బయటపడ్డ వాచీలే బహిర్గతం చేశాయని పేర్కొన్నారు. జగన్ కేసులను మళ్ళీ మొదటి నుంచి ఎందుకు విచారించాలని కోర్టులు ఎందుకు భావిస్తున్నాయని..ఎంత కాలం ఈ కేసులు సాగదీస్తారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.