Telugu Gateway
Politics

సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మకు షాక్

సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మకు షాక్
X

అలోక్ వర్మకు షాక్. సుప్రీంకోర్టు తీర్పు ఆనందం ఆయనకు ఎంతో కాలం నిలవలేదు. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ గురువారం నాడు సమావేశం అయి..సుదీర్ఘ చర్చలు జరిపి..అలోక్ వర్మను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే వర్మ తొలగింపును వ్యతిరేకించగా...ప్రధాని నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు జడ్జి సిక్రీలు మొగ్గుచూపారు. దీంతో వర్మపై వేటుకు మార్గం సుగమం అయింది. తాజా పరిణామంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయన ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. సీబీఐ హైలెవల్‌ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు బదులుగా జస్టిస్ ఏ కే సిక్రి పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వర్మ బుధవారమే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

అంతకుముందు సీబీఐ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అలోక్‌ వర్మ వరుస సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీబీఐ డైరెక్టర్‌(ఇన్‌చార్జ్‌)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేశారు. అంతేకాకుండా జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేశన్, ఏడీ ఏకే శర్మ తదితరులు ఉన్నారు. ఈ తరుణంలో మోడీ నేతృత్వంలోని కమిటీ సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో కొత్త డైరక్టర్ నియామకం పూర్తి చేయనున్నారు.

Next Story
Share it