Telugu Gateway
Andhra Pradesh

ఢిల్లీలో దీక్షకు రెడీ అయిన చంద్రబాబు

ఢిల్లీలో దీక్షకు రెడీ అయిన చంద్రబాబు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అఖరి అస్త్రంగా ఢిల్లీలో దీక్షకు రెడీ అయ్యారు. ఈ పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఆయన ఢిల్లీలో ఒక రోజు దీక్షకు దిగాలని శనివారం అమరావతిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విభజన హామీలు అమలు చేయాలని..ఏపీకి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను ఇవ్వాలని కోరుతూ ఈ దీక్షకు రెడీ అయినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ధర్మపోరాట దీక్షలతో హంగామా చేస్తున్న చంద్రబాబు ఎన్నికల ముందు ఈ అస్త్రాన్ని ఏకంగా ఢిల్లీకి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. దీక్షకు ఎంచుకున్న సమయం చూస్తే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం కంటే రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. అయితే మరి ఈ దీక్షపై కేంద్రంలోని మోడీ సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సింద. ఇఫ్పటికే బిజెపి తాము ఏపీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని చెబుతోంది. టీడీపీ మాత్రం ఇంకా కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వాదిస్తోంది.

ఈ పరిణామాల నేఫథ్యంలో వచ్చే నెలలో అటు లోక్ సభతో పాటు ఇటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ తరుణంలో చంద్రబాబు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘మన కృషితోనే చట్టంలో అంశాలను సాధిస్తున్నాం. కేంద్రం నుంచి పన్ను రాయితీల కోసం డిమాండ్ చేయాలి. కేంద్రం ఇంకా మనకు రూ.లక్షా 16వేల కోట్లు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ నివేదికను కేంద్రానికి ఇవ్వాలి. అన్ని మంత్రిత్వ శాఖలకు నివేదికను అందజేయాలి.జయప్రకాష్ నివేదిక కేంద్రానికి ఇవ్వాలి. పవన్ జెఎఫ్ సి నివేదిక కూడా ఇవ్వాలి. ఎప్పటికీ తప్పు చేయకూడదు. తప్పుకు ప్రతిబింబంగా ఉండరాదు. ఇదే ఇన్నేళ్లలో నేను నేర్చుకుంది. తప్పులతో జీవచ్ఛవంలా మిగిలిపోరాదు. అందుకే నిజాయితీగా ఉంటాను. నీతివంతంగా వ్యవహరిస్తాను.’ అని పేర్కొన్నారు. చంద్రబాబు ఢిల్లీ దీక్షలో ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఓ ముఖ్యమంత్రి రాష్ట్ర డిమాండ్లపై ఇలా ఢిల్లీలో దీక్షకు కూర్చోవటం రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it