కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు..వైఎస్ అవినీతికి ఎండార్స్ మెంట్ !
వైఎస్ ఏ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేశారు?. కాంగ్రెస్ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పటి అవినీతికి ఆమోద ముద్ర వేసినట్లేనా?.. పోనీ వైఎస్ అవినీతికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పదలచుకున్నారా?. అలా అనటానికి కూడా కుదరదు. వైఎస్ హయాంలో అవినీతి విపరీతంగా జరిగిందని..ఢిల్లీలో ఉన్న సోనియాగాంధీకి డబ్బుల సంచులు పంపుతున్నారని సాక్ష్యాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మొదలుకుని టీడీపీ నేతలు విమర్శించారు. మరి ఉమ్మడి ఏపీలో అవినీతికి పాల్పడిన వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం ఏమిటి?. అంటే అప్పుడు చేసిన అవినీతి ఆరోపణలు అబద్ధమా?. లేక ఇప్పుడు తనకు రాజకీయ అవసరం వచ్చింది కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా?. చంద్రబాబు అండ్ కో ఒక్క వైఎస్ మీదే కాకుండా సోనియాగాంధీ, రాహుల్ లపై కూడా అప్పట్లో కూడా విమర్శలు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీలో ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రశంసిస్తే వైసీపీ, టీఆర్ఎస్ కలసి పోయిందనటానికి ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలి? అంటూ చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా వైఎస్ ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం మాత్రం ప్రజల హృదయాలను తాకిందనటంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా వైఎస్ ను చంద్రబాబుతో పాటు కెసీఆర్ కూడా తీవ్రమైన విమర్శలు చేసినమాట నిజమే. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చావుదెబ్బ తిన్న టీడీపీ..ఏపీలో మాత్రం పొత్తు విషయంలో దోబూచులాడుతోంది. కేంద్రలో మాత్రం రాహుల్ గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ తో కలసి యూపీఏలో ఉండటం మాత్రం ఖాయం. అంటే చంద్రబాబు లెక్క ప్రకారం వైఎస్ కానివ్వండి..రాహుల్ కానివ్వండి ఏప్రీ ప్రజల సంపద ఎంత దోచుకున్నా పర్వాలేదు..తనకు మాత్రం మద్దతు ఇస్తే చాలు. ఇదేనా రాజకీయం అంటే?.