పీక్ కు చేరుతున్న ఏపీ పాలిటిక్స్
ఏపీ రాజకీయాలు రోజు రోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అసలు రాష్ట్రంలో పెద్దగా ఉనికే లేని బిజెపితో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢీకొడుతున్నట్లు ప్రచారం చేసుకోవటం ఒకెత్తు అయితే..బిజెపి కూడా టీడీపీపై దాడిని మరింత తీవ్రం చేసింది. శుక్రవారం నాడు చంద్రబాబు కాకినాడలో పాల్గొన్న జన్మభూమి కార్యక్రమంలో పలువురు బిజెపి కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా..చంద్రబాబు ఓ మహిళను ఉద్దేశించి నాతో పెట్టుకుంటే ఫినిష్ చేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..మీరు రాష్ట్రంలో ఉండి..నన్ను ప్రశ్నలు అడుగుతారా?. అడగాల్సిన ప్రశ్నలు మోడీ, కేంద్రాన్ని అడగండి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చంద్రబాబును దుర్భాషలాడుతున్న సమయంలో ప్రధాని మోడీ హాయిగా నవ్వుతున్న వీడియో ఒకటి కూడా దుమారం రేపుతోంది.
చంద్రబాబును వీర్రాజు తిట్టగానే మోడీని నవ్విన తీరు కూడా ఆక్షేపణీయంగానే ఉంది. ఓ ప్రధాని స్థాయి వ్యక్తి అలా ప్రవర్తించటం ఆ వీడియో చూసిన వారెవరికైనా ఆక్షేపణీయంగానే అన్పిస్తుంది. టీడీపీ కార్యకర్తలు శనివారం నాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు ధర్నా చేయటంతో వివాదం మరింత ముదిరింది. ఈ ధర్నా..దాడి ప్రయత్నాలను కన్నా లక్ష్మీనారాయణ తనపై హత్యాయత్నంగా పేర్కొనటంతోపాటు దీనిపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు తలచుకుంటే బిజెపి నేతలు అసలు ఏపీలో తిరగగలరా?. అంటూ ప్రశ్నించటం మరో వివాదంగా మారనుంది.
అధికార పార్టీ నేతలే ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా వ్యవహరించటం చర్చనీయాంశం అవుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్నా..ఇప్పుడే పరిస్థితులు ఇలా మారితే..రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణాలు ఏమైనా ఏపీ ప్రజల్లో బిజెపిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే బిజెపి కూడా చంద్రబాబు విషయంలో కాస్త దూకుడుగా వెళ్ళేందుకే నిర్ణయించుకున్నట్లు కన్పిస్తోంది. రాబోయే రోజుల్లో పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.