రెండు గంటల్లో రెండు లక్షల రుణమాఫీ

ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల్లోనే ఎన్నికల హామీల్లో ప్రధానమైన రెండు లక్షల వ్యవసాయ రుణాల మాఫీ చేసేశారు. ఆ మేరకు తొలి ఫైలుపై సంతకం చేశారు. ఆయనే మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి కమల్ నాథ్. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా రెండు లక్షల రూపాయల రుణ మాఫీ అంశాన్ని ప్రముఖంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ నినాదం కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలసి రాలేదు కానీ..మధ్యప్రదేశ్ లో మాత్రం బాగానే పనిచేసినట్లు కన్పిస్తోంది. మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సమక్షంలో సీఎంగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. కమల్‌నాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు.
1984 సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టిపారేస్తూ ఆయనకు జీవిత ఖైదు విధించింది. అయితే సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుతో కమల్‌నాథ్‌కు కూడా సంబంధాలు ఉన్నాయంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సీఎం కమల్‌నాథ్ లక్ష్యంగా ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడికి దిగింది. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టు తీర్పును రాజకీయం చేయొద్దని హితవు పలికారు.