Telugu Gateway
Politics

‘రేవంత్’ చుట్టూ రాజకీయం

‘రేవంత్’ చుట్టూ రాజకీయం
X

తెలంగాణ రాజకీయం అంతా ఇఫ్పుడు ‘రేవంత్ రెడ్డి’ చుట్టూ తిరుగుతోంది. ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బంద్ కు పిలుపునివ్వటం ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పు అయినా..పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డిని అవసరమైనంత బలగంతో హౌస్ అరెస్ట్ చేస్తే సరిపోయేదని..అలా కాకుండా...తెల్లవారు జామున మూడు గంటల సమయంలో బెడ్ రూం తలుపులు పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధిని అరెస్టు చేయాలంటే చాలా పద్దతులు పాటించాల్సి ఉంటుందని..కానీ పోలీసులు మాత్రం అవేమీ పాటించినట్లు కన్పించటం లేదని చెబుతున్నారు. ఇంకా కేవలం ఒక్క రోజులోనే ప్రచారం ముగియనుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధిని అరెస్టు చేస్తే ఆయన ప్రచారం చేసుకునే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. ఆయనతోపాటు ఆయన అనుచరగణం మొత్తాన్ని అరెస్టు చేయటం ఏ మాత్రం సరికాదని చెబుతున్నారు. అదే హౌస్ అరెస్టు చేసి కెసీఆర్ సమావేశం ముగియగానే వదిలిపెడితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండేదికాదని..కానీ కొడంగల్ నుంచి వేరే ప్రాంతానికి తరలించటం...తదితర అంశాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ విషయంలో ఎన్నికల సంఘం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అంశాన్ని అస్త్రంగా మార్చుకుని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలుకుని కాంగ్రెస్ నేతలు అందరూ రేవంత్ రెడ్డి అరెస్టు అంశంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కెసీఆర్ సర్కారు చర్యలు ఎమర్జన్సీని తలపిస్తున్నాయని ఆరోపించారు. పోలీసులు కూడా ధర్మబద్ధంగా నడుచుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి అరెస్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ సీఎంగా కెసీఆర్ అందరి హక్కులూ హరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపద్ధర్మ సీఎంగా అసలు సీఎం కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారని విమర్శలు చేశారు. రాహుల్‌ గాంధీ మీటింగ్‌కు తాను కూడా కొడంగల్‌ వెళ్లానని, తాము వచ్చాక ఎలాంటి సెర్చ్‌ వారంట్‌ లేకుండా కాంగ్రెస్‌ కార్యకర్తల ఇళ్లల్లో దుర్మార్గంగా సోదాలు చేశారు..దానికి నిరసనగానే రేవంత్‌ రెడ్డి ప్రొటెస్ట్‌ కాల్‌ ఇచ్చారు.. మొదట ఇచ్చిన బంద్‌ పిలుపును విరమించుకుని నిరసన పిలుపు ఇచ్చారని తెలిపారు.

అది కూడా సీఎం మీటింగ్‌ జరిగే కోస్గిలో కాదని, కోస్గి అవతల ఉన్న కొడంగల్‌లో అని వెల్లడించారు. కానీ నేరుగా అర్దరాత్రి పోలీసులు దొంగళ్లా వెళ్లి భార్యా పిల్లలతో బెడ్‌రూంలో ఉన్నప్పుడు డోర్‌ పగలగొట్టి అరెస్ట్‌ చేశారని చెప్పారు. రేవంత్‌ రెడ్డి భార్య నా తమ్ముడి కూతురు. నాకు రాత్రి ఫోన్‌ చేసింది. నేను కేసీఆర్‌ను అడుగుతున్నా. రేపు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక నీ కూతురిని అలానే డోర్‌ పగలగొట్టి అరెస్ట్‌ చేస్తే ఊరుకుంటావా. కొన్ని వందల మంది రేవంత్‌ రెడ్డి అనుచరులను అరెస్ట్‌ చేశారు. కేసీఆర్‌ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కేర్‌ టేకర్‌ మాత్రమే పూర్తి సీఎం కాదు. అయినా పోలీసు అధికారులు కేసీఆర్‌కు వంత పాడుతున్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళతాం. ఓటమి భయం పట్టుకునే సీఎం కేసీఆర్‌ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. అందుకే సంగారెడ్డిలో జగ్గారెడ్డి, గజ్వేల్‌లో ప్రతాప్‌ రెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి పట్ల దుర్మార్గం వ్యవహరిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

Next Story
Share it