Telugu Gateway
Andhra Pradesh

15 వేల కోట్ల నిధులు పోశారు...నీళ్ళు అడుగంటాయి

15 వేల కోట్ల నిధులు పోశారు...నీళ్ళు అడుగంటాయి
X

నీరు-చెట్టులో ‘దోపిడీ చంద్రజాలం’

నాలుగేళ్లలో 15635 కోట్ల ఖర్చు

ఆ డబ్బుతో పది పట్టీసీమ ప్రాజెక్టులు కట్టొచ్చు. దోపిడీ మొత్తంతో కలుపుకునే సుమా. అదే డబ్బుతో ఏకంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఎంత అద్భుతంగా అయినా సరే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి భవనాల నిర్మాణం పూర్తిచేయవచ్చు. అంతే కాదు...ఆ నిదులతోనే కొంత మేర మౌలికసదుపాయాలూ అందుబాటులోకి వస్తాయి. ఆ డబ్బుతో ఒక్క దెబ్బకు ఏపీ లోటుబడ్జెట్ కాస్తా ఎగిరిపోతుంది. అది ఏ డబ్బు..ఎక్కడి డబ్బు అంటారా?. ఈ భారీ దోపిడీ ఏంటో మీరే చూడండి. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఏపీ సర్కారు నీరు-చెట్టు కింద పెట్టిన ఖర్చు ఇది. ఆ మొత్తం ఎంతో తెలుసా?. అక్షరాలా 15635 కోట్ల రూపాయలు. ఇది అంతా ఇప్పటికే ఖర్చు పెట్టిన మొత్తం. ఈ నిధుల్లో 4136 కోట్ల రూపాయలను సాగునీటి శాఖ సమకూర్చగా..గ్రామీణాభివృద్ధి శాఖ 11347 కోట్ల రూపాయలు, అటవీ శాఖ 152 కోట్ల రూపాయలు సమకూర్చింది. లోటు బడ్జెట్ తో ఉండి..రాజధానికి భవనాలు కూడా లేని రాష్ట్రంలో ఏకంగా 15635 కోట్ల రూపాయలు నీరు-చెట్టుపై ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది. పోనీ ఇంత భారీ మొత్తంలో వ్యయం చేసినందుకు ఏపీలో ఏమైనా భూగర్భ జలాలు అమాంతంగా పెరిగిపోయాయా? అంటే అదీ లేదు.

మరి ఈ నిధులన్నీ ఎక్కడకు పోయినట్లు?. ఏమైపోయినట్లు?. అంటే అంతా దోపిడీనే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పేరుతో భారీ ఎత్తున దోపిడీ చేసేందుకు అవకాశం ఉన్నందునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకంపై నిత్యం ‘ప్రత్యేక శ్రద్ధ’ చూపించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత భారీ మొత్తంలో నిధులు ఖర్చు పెడితే మరి భూగర్భ జలాలు పెరగాలి కదా?. అందుకు భిన్నంగా గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత తగ్గటం విశేషం. అంటే ఈ నిధులను ఖర్చు చేయలేదు..దోచేశారు అనుకోవాలా?. లేకపోతే ఫలితాలు ఎందుకు రావు. సర్కారు లెక్కల ప్రకారమే 2017 అక్టోబర్ లో తూర్పు గోదావరి జిల్లాలో 4 మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్ల దిగువున ఉంటే..2018 అక్టోబర్ నాటికి ఈ మండలాల సంఖ్య 10కి పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 12 నుంచి 13కి, కృష్ణా జిల్లాలో 3 నుంచి 4కి, ప్రకాశం జిల్లాలో 13 నుంచి 22కు, సీఎం సొంత జిల్లా చిత్తూరులో 22 నుంచి 29కి, కడపలో 18 నుంచి 24 మండలాలకు పెరిగాయి.

కర్నూలులో కూడా ఏడు మండలాల నుంచి 10 మండలాలకు పెరిగాయి. 20 మీటర్ల దిగువన భూగర్బ జలాలు ఉన్న మండలాల సంఖ్య 2017 అక్టోబర్ నాటికి 132 ఉంటే ఇది 2018 నాటికి 171 మండలాలకు పెరగటం విశేషం. మరి 15635 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్కారు ఏమి సాధించినట్లు?.దీన్ని బట్టే అర్థం అవుతుంది కదా ఈ పథకం పేరుతో ఎంత భారీ దోపిడీ జరిగిందో. ప్రభుత్వం మాత్రం ఈ నిధులను ఖర్చు చేయటం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ చేశామని..చెరువుల్లో పూడిక తీశామని చెబుతోంది. ఏది ఏమైనా సర్కారు నీరు-చెట్టు పథకం కింద ఖర్చు చేసిన 15635 కోట్ల రూపాయల ఖర్చుతో ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it