Telugu Gateway
Telangana

బాకా పేపర్లు అవి

బాకా పేపర్లు అవి
X

తెలుగుదేశం అదినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే కాకుండా కెసీఆర్ మీడియాపైనా ఎటాక్ చేశారు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయకున్నా ఏదో చేసినట్లుగా రెండు పత్రికలు, కొన్ని టీవీలు ప్రజలను నమ్మిస్తుంటాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘చంద్రబాబు దగ్గర రెండు, మూడు బాకా పేపర్లు ఉన్నాయి. రెండు బాకా పేపర్లు డప్పు కొట్టుడు. ఏది మాట్లాడినా ఈస్ట్‌ మన్‌ కలర్‌ ఫొటోలతో కథలు వేస్తారు. చక్రం తిప్పుడు లేదు. చంద్రబాబుకు రెండు ముక్కలు ఇంగ్లీషు మాట్లాడం రాదు. కనీసం రెండు లైన్‌లు హిందీ కూడా రాదు. కేసీఆర్‌ యజ్ఞాలు చేస్తాడని మోదీ అన్నాడు. నాకు నమ్మకం ఉంది వస్తే నీకు కూడా ప్రసాదం పెడతా అన్నా. యజ్ఞ, యాగాలపై నాకు నమ్మకం ఉంది. దేవుడిపై నాకు విశ్వాసం ఉంది. యజ్ఞాలు చేస్తే నాకు మంచే అవుతోంది. నేను రాజశ్యామల యాగం చేశా. రాజశ్యామల అమ్మవారి ఆలయం విశాఖపట్నంలోనే ఉంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం భువనేశ్వర్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నా. శారదాపీఠం స్వామి వారికి ఇదే విషయం చెప్పా. విశాఖపట్నానికి రండి పూజలు చేసి భోజనం చేసి వెళ్దురు అన్నారు.

నేను వెళ్లా. నేను ఊహించలేదు. అక్కడ విమానాశ్రయానికి చాలా మంది వచ్చారు. శారదాపీఠం వరకు 18 కిలోమీటర్ల దారి పొడవునా స్థానికులు నాకు ఉత్సాహంగా అభివాదం చేశారు. అభిమానంతో వచ్చారు. నేను అభివాదం చేశా. ఆ దారి పొడవునా కొందరు ఫెక్సీలు కట్టారు. ఆ రెండు బాకా పేపర్లు వైఎస్సార్‌సీపీ వాళ్లు, వెలమలు వచ్చారు అని రాశాయి. వాళ్లు ఆంధ్ర ప్రజలు కాదా. వాళ్లు ఎందుకు వచ్చారు. చంద్రబాబును తెలంగాణలో పొల్లుపొల్లు కొట్టినందుకు, తన్ని పంపించినందుకు ప్రజలలో కనిపించిన ఉత్సాహం అది. ఆంధ్రప్రదేశ్‌ వార్తలు ఇక్కడ హైదరాబాద్‌లో ఎందుకు. ప్రజలను అయోమానికి గురి చేయడానికా? తెలంగాణ ప్రాంతంగా ఉండే పేపర్లకు సహరించేలా నిర్ణయాలు తీసుకుంటాం’అని ఆయన స్పష్టం చేశారు.

Next Story
Share it