Telugu Gateway
Telangana

హరీష్ రావుకు చెక్ పెట్టిన కెసీఆర్!

హరీష్ రావుకు చెక్ పెట్టిన కెసీఆర్!
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో రాజకీయ పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్రం వచ్చిన కొత్తలో జరిగిన ఎన్నికల్లోనే టీఆర్ఎస్ కు కేవలం 63 సీట్లే వచ్చిన రోజుల్లోనే కెసీఆర్ మాటను పార్టీలో ధిక్కరించిన వారు లేరు. అంతే కాదు..నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఈ నిర్ణయం తప్పు అని బహిరంగంగా నోరెత్తిన వారు లేరు. కెసీఆర్ ఏది చేస్తే అదే రైట్ అనే వారు. అంతర్గత సంభాషణల్లోనూ ఒకరిద్దరు మంత్రులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసే వారే తప్ప..పెద్దగా మాట్లాడింది లేదు. ఇప్పుడు ఏకంగా టీఆర్ఎస్ కు సొంతంగానే 88 సీట్లు వచ్చాయి. ఇక పార్టీకి ఐదేళ్ళ పాటు తిరుగే లేదు. ఇద్దరు స్వతంత్రులు కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు. అంటే నికరంగా బలం 90కి చేరింది. 119 సీట్లు ఉన్న అసెంబ్లీలో 90 మంది సభ్యులు అధికార పార్టీ వారే అంటే అంతా ఏకపక్షమే. ఇక ఇప్పుడు కెసీఆర్ కు తిరుగే ఉంటుంది?. అందుకే ఆయన వేగంగా పావులు కదుపుతూ టీఆర్ఎస్ లో అత్యంత కీలక నేత అయిన హరీష్ రావుకు చెక్ పెట్టి పార్టీపై పూర్తి పట్టుకోసం తన తనయుడు కెటీఆర్ కు కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పార్టీ నాయకులు అంతా కెటీఆర్ చుట్టూనే తిరుగుతున్నారు. ఇప్పుడు ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేయటంతో దీనికి మరింత చట్టబద్ధత లభించినట్లు అయింది.

కెసీఆర్ కేంద్ర రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నందుకే ఇదంతా అని చెబుతున్నా కూడా ..అసలు విషయం కొడుకు కెటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడంతోపాటు..పార్టీ పగ్గాలు అప్పగించటమే అసలు లక్ష్యం అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కెసీఆర్ తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా ఈ తరుణంలో హరీష్ రావుస్పందించే అవకాశాలు ఏ మాత్రం లేవు. కెటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమితులైనట్లు ప్రకటన వచ్చిన వెంటనే అందరూ కెటీఆర్ దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు తెలపగా...కెటీఆర్ మాత్రం హరీష్ రావు ఇంటికి వెళ్ళి కలసి రావటం విశేషం. తాము హరీష్ రావుకు కావాల్సినంత గౌరవం ఇస్తున్నామనే సంకేతాలు పంపటానికి కెటీఆర్ ఇలా చేసి ఉంటారని చెబుతున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు ఉంటాయని ఈ వ్యవహారాలను దగ్గరి నుంచి చూస్తున్న వారు చెబుతున్నారు.

Next Story
Share it